హనుమకొండ, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాన్యుల భూములకు రక్షణ లేకుండా పోతున్నది. అధికార పార్టీ నేతల భూముల ఆక్రమణకు హద్దు ఉండడంలేదు. విలువైన భూములను చూస్తే వదలడంలేదు. ఖాళీగా ఉన్న పెద్ద పాట్లను కిరికిరి పెట్టి ఆక్రమిస్తున్నారు. కాకతీయ కెనాల్ కింద భూమిని తమదిగా చెప్పుకొని.. పక్కన ఉన్న సామాన్యుల భూములను ఆక్రమించారు. హనుమకొండ రెడ్డిపురంలోని రూ. 5 కోట్ల విలువైన 2 వేల గజాల భూమిని కబ్జా చేశారు.
నగరంలోని ఓ ఎమ్మెల్యే తమ్ముడు సహా 12 మంది కలిసి చేసిన కబ్జాతో 8 కుటుంబాలు ఆగమవుతున్నాయి. రిటైరైన ఎస్సై, ఏఎస్సై, కండక్టర్, ఓ పోలీసు స్టేషన్ స్వీపరు సైతం బాధితులుగా మిగిలారు. 45 ఏండ్ల క్రితం కొనుగోలు చేసిన తమ భూమిని కాపాడుకునేందుకు వీరంతా పోలీసు, మున్సిపల్ అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. ఎమ్మెల్యే తమ్ముడినని, భూమి వద్దకు రావొద్దని తమను బెదిరిస్తున్నారని, తమకు న్యాయం జరగడం లేదని బాధితులు వాపోతున్నారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నాలుగో డివిజన్ రెడ్డిపురంలో మేకల మర్రిరెడ్డికి చెందిన 106ఏ/1 సర్వే నెంబర్లోని 2.11 ఎకరాల భూమిని ప్లాట్లు చేయగా కాయిత రాములు(రిటైర్డ్ ఏఎస్సై), పంచగిరి రాజేందర్(రిటైర్డ్ ఎస్సై), గణపురం సమ్మయ్య (హనుమకొండ పీఎస్ స్వీపర్), నాతి సాంబయ్య(రిటైర్డ్ కండక్టర్), చుక్క చంద్రకళ(వితంతువు), ఎం ప్రకాశ్(ఫొటోగ్రాఫర్) 1980లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరు చెప్పిన వివరాల ప్రకారం.. వారి ప్లాట్లకు ఆనుకుని ఉన్న మాడిశెట్టి కొమురయ్యకు చెందిన 106/సీ సర్వే నంబరులోని 27 గుంటలు, 107/బీ సర్వే నంబరులోని 37 గుంటలు కలిపి 1.24 ఎకరాల భూమిని అమ్మేందుకు సుద్దపెల్లి కొమురయ్యకు జీపీఏ (12/1981) ఇచ్చారు.
కాకతీయ కాలువ కోసం ప్రభుత్వం సేకరించి నష్టపరిహారం ఇచ్చిన భూమిలో ఇది ఉన్నదని, 16 గుంటలు చొప్పున నాలుగు భాగాలు చేసి భగీరథ్‌సింగ్, ఉదయ్‌సింగ్, మేతె నర్సింహారెడ్డి, కంచెర్ల రుక్మారెడ్డికి అమ్మారు. పొలాలకు నీరు వెళ్లేందుకు పిల్ల కాలువ కోసం 1989లో రాష్ట్ర ప్రభుత్వం భగీరథ్సింగ్కు చెందిన 107/బీ సర్వే నంబర్లోని 8 గుంటలు సేకరించింది. జీపీఏ హోల్డర్ అప్పటికే చనిపోవడంతో ఆయన కుమారుడు సుద్దపల్లి ఐలయ్యకు కోర్టు ద్వారా వడ్డీతో సహా పరిహారం చెల్లించింది. 2018లో నాయిని లక్ష్మారెడ్డి, కర్ర రాజిరెడ్డి, ఎంఏ కరీం, ఈ మోహన్‌రెడ్డి, పోచాల రఘువీర్, రామకిషోర్, వేల్పుల దేవాచారి, వేల్పుల మధుకర్, గుడిపెల్లి సత్యనారయణ, కన్నోజు జలంధర్, గోపాలపురం పరమేశ్వర్, ముడిద వెంకటేశ్వర్లు కలిసి బాధితుల ప్లాట్లను ఆక్రమించేందుకు వచ్చారు.
అప్పుడు 106, 107 సర్వే నంబర్లలోని మొత్తం భూమి, కాకతీయ కాలువ కోసం ప్రభుత్వం సేకరించగా ఎవరి పేరుతో ఎంత ఉన్నదనే సమగ్ర వివరాలతో ఉన్న రికార్డులను కోర్టు ద్వారా సేకరించి 2024 ఏప్రిల్ 17న కాకతీయ యూనివర్సిటీ పోలీసు స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. అప్పుడు పని చేసిన ఇన్స్పెక్టర్.. ఎస్సైని భూమి వద్దకు పంపించారు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ల బదిలీ అయిన ప్రతిసారి బాధితులు వెళ్లి కలిసినా ప్రయోజనం ఉండడంలేదు. ప్రస్తుత సీఐ రవికుమార్ కనీసం తమ సమస్యను వినేందుకు ఇష్టపడడంలేదని బాధితులు వాపోయారు. హనుమకొండ ఏసీపీకి, వరంగల్ పోలీసు కమిషనర్‌కు, వరంగల్ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రాలు ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే తమ్ముడు నాయిని లక్ష్మారెడ్డి తమ పాట్లను ఆక్రమించి ఇండ్లు కడుతున్నారని బాధితులు చెప్పారు. తమ భూములో ఇండ్ల నిర్మాణం మొదలుపెట్టినప్పుడు కేయూసీ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఇన్స్పెక్టర్కు చెబితే.. మీరే పనులు ఆపాలని చెప్పుకోండని అన్నారని వాపోయారు. అక్కడి నుంచి తమ ప్లాట్ల వద్దకు పోయేలోపు కేయూసీ ఇన్స్పెక్టర్ రవికుమార్ హనుమకొండ ఏసీపీకి తమకు వ్యతిరేకంగా చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాట్ల వద్దకు రావాలని హనుమకొండ ఏసీపీ చెప్పారని.. తాము, నాయిని లక్ష్మారెడ్డి గ్రూపు అక్కడికి వెళ్లామని తెలిపారు. ఏసీపీ డాక్యుమెంట్లు పరిశీలించి సర్వేయర్‌కు ఫోన్‌చేసి తమ భూములను సర్వేచేసి రిపోర్టు ఇవ్వాలని చెప్పారని తెలిపారు.
తహసీల్దారు ఆఫీస్ సర్వేయర్ 106, 107 సర్వ నంబర్లలోని భూములను సర్వే చేసి వాస్తవ సమాచారాన్ని తెలిపారని చెప్పారు. సర్వే తర్వాత సైతం కబ్జాదారుల తీరు మారలేదని వాపోయారు. పడమరవైపు హద్దు పిల్ల కాలువ మధ్యలో ఉన్నదని తెలిసినా అటువైపు కాకుండా తమ ప్లాట్లను వదలడంలేదని అన్నారు. అధికారం, పలుకుబడితో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఆఫీసు నుంచి అనుమతులు తెచ్చి తమకు చెందిన 8 ప్లాట్లలో రోడ్లు వేసి, ప్రహరీ నిర్మాణం పూర్తి చేశారని చెప్పారు. ఎమ్మెల్యే తమ్ముడు కబ్జా చేసి తమ ప్లాట్లలో ఇండ్లు కడుతున్నారని మున్సిపల్ కమిషనర్‌ను నాలుగుసార్లు కలిసి చెప్పినా చర్యలు తీసుకోవడంలేదని వాపోయారు.
నేను, మరికొంత మంది కలిసి ప్లాట్లు కొని 1980ల రిజిస్ట్రార్ చేసుకున్నాం. నాయిని లక్ష్మారెడ్డి, కర్ర రాజిరెడ్డి, ఎంఏ కరీం, ఇనుగాల మోహన్‌రెడ్డి, పోశాల రఘువీర్, రామకిషోర్, వేల్పుల దేవాచారి, వేల్పుల మధుకర్, గుడిపెల్లి సత్యనారాయణ, కన్నోజు జలంధర్, గోపాలపురం పరమేశ్వర్, ముడిద వెంకటేశ్వర్లు కెనాల్ భూమి కొని రిజిస్టర్ చేసుకొని మా ప్లాట్లలోకి వచ్చిండ్లు. మా 8 ప్లాట్లలో రోడ్లు వేసి, పడారి గోడలు పెట్టి ఇండ్లు కడుతాండ్లు. మా ప్లాట్లను ఆక్రమించారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డికి చెప్పుకోవడానికి పోతే తాను భూముల పంచాయతీ చేయను.. మీరు, పోలీసులు చూసుకోవాలని అన్నడు.
– కాయిత రాములు, రిటైర్డ్ ఏఎస్సై, రాంనగర్, హనుమకొండ
పైసా పైసా కూడబెట్టుకొని జాగ కొనుక్కుంటే ఎమ్మెల్యే తమ్ముడు ఆక్రమించిండు. అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకుంటలేరు. మా ప్లాట్లను కబ్జా చేసి ఇండ్లు కడుతున్నరని అధికారుల చుట్టూ తిరుగుతున్నం. పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ కలిసి ఎన్నోసార్లు దరఖాస్తు పెట్టినం. వాళ్లు వచ్చి చూసినా ఏం చేయలేదు. మా ప్లాట్లు మాకు ఇప్పించాలి.
– చుక్క చంద్రకళ, రెడ్డికాలనీ, హనుమకొండ