హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 3 : చారిత్రక వేయి స్తంభాల రుద్రేశ్వరాలయంలో వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి వార్ల కళ్యాణ బ్రహ్మోత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. గురువారం ఉదయం స్వామివార్లకు ప్రత్యేక పూజలు పండితులు గుదిమెళ్ల విజయ్కుమారాచార్యులు నిర్వహించి శ్రీసీతారామచంద్రస్వామిని రాజీవలోచనుడిగా అలకరించి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా భక్తులందించిన లిల్లీ, చామంతి, 3 రకాలు గులాబీ, కనకాంబరాలు, సెంటుమల్లెలు, లక్ష పుష్పాలతో లక్ష రామనామస్తోత్రాలు సీతాలక్ష్మణస్తోత్రాలతో లక్షపుష్పార్చన వైభవంగా నిర్వహించినట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. అనంతరం స్వామివారికి చిత్రాన్న నైవేద్యం సమర్పించి నీరాజన మంత్రపుష్పాలు, మహిళలు మంగళహారతులు స్వామివారికి సమర్పించారు. అర్చకులు గంగు మణికంఠశర్మ, ప్రణవ్‌లు వైదిక కార్యక్రమాలు నిర్వర్తించారు. ఆలయ ఈవో డి.అనిల్‌కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు.