హనుమకొండ, నవంబర్ 14 : చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామి మారేడు దళాలతో లక్ష బిల్వాదళములతో లక్ష శివనామములతో లక్ష బిల్వార్చన నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిట్టిరెడ్డి రాంరెడ్డి-లక్ష్మి దంపతుల సౌజన్యంతో ఉభయదాతలుగా రుద్రేశ్వరునికి వేదోక్తంగా ఆలయ అర్చకులు వేదమంత్రాల మధ్య ‘త్రిదళం త్రిగుణాకరం’ అంటూ బిల్వార్చన నిర్వర్తించారు. మధ్యాహ్నం 2 వేల మంది భక్తులకు దేవతా వృక్షాల కింద వనభోజనాలు ఏర్పాటు చేశారు.
ఈ వనభోజనాలలో మెదక్, ఆసిఫాబాద్, హైదరాబాద్, ఖమ్మం జిల్లాలకు చెందిన భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకొని అన్నం:పరబ్రహ్మ స్వరూపంగా భావించి స్వీకరించారు. సాయంకాల సమయంలో వందలాది మంది మహిళలు శుక్రవారాన్ని పురస్కరించుకొని దేవాలయ ఆవరణలో మహాలక్ష్మికి ప్రీతికరంగా దీపాలు వెలిగించుకున్నారు. వైదిక కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, వేదపండితులు గంగు మణికంఠశర్మ, సందీప్‌శర్మ, ప్రణవ్‌శర్మ నిర్వహించారు. ఆలయ ఈవో డి.అనిల్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ సిబ్బంది రామకృష్ణ, రంజిత్, రజిత భక్తులకు సేవలందించారు.