మరిపెడ : ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం తగ్గించి పేదలకు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో ప్రారంభించబడింది. కానీ జాతీయ ఉపాధి హామీ పథకం పురపాలక సంఘం పరిధిలోని కూలీలకు శాపంగా మారింది. జాబ్ కార్డు కలిగి ఉండి 20 రోజులు పని చేసిన వారికి ఏడాదికి రూ.12,000 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ పురపాలక సంఘంలో జీవిస్తున్న కూలీలకు హామీ పథకం లేకపోవడంతో కూలీలకు పనులు లేకపోవడం ఇందిరా ఆత్మీయ భరోసాకు అర్హులు కాకపోవడంతో జీవనం కొనసాగించడానికి నానా ఇబ్బందులు పడుతున్నట్లు కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పట్టణాలలో కూడా పేదల నివసిస్తున్నారని, వారి బతుకు తెరువుకై ప్రభుత్వం పురపాలక సంఘం పరిధిలో ఉపాధి పథకం కొనసాగించాలని మహిళా కూలీలు గురువారం మరిపెడ పురపాలక సంఘం కార్యాలయం ఆవరణంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మహిళా కూలీలు మాట్లాడుతూ పురపాలక సంఘం పరిధిలో పనులు లేకుండా పోయిందని, ఎండాకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు, గతంలో కూడా పలుమార్లు పనులు కల్పించాలని అధికారులు దృష్టికి తీసుకు పోయినట్లు తెలిపారు.
పొలం పనులు లేనప్పుడు ఉపాధి కూలికి వెళ్లి కుటుంబాన్నిపోషించుకుంటున్నామని, వ్యవసాయ పనులకు పోదామంటే పంటలు పండగ పోవడం లేక పంటలు ఎండిపోవడం వలన పనులకు ఎవరు పిలవడం లేదని వాపోయారు. ప్రభుత్వ స్పందించి పురపాలక సంఘం పరిధిలో ఉపాధి పనులు కల్పించాలని లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఉపాధి పనులు కల్పించాలని పురపాలక సంఘం కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు.