బచ్చన్నపేట, ఆగస్టు 08 : ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలనీ కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి శేఖర్ డిమాండ్ చేశారు. బచ్చన్నపేటలోని స్థానిక కార్యాలయంలో బొట్టు కరుణాకర్ అధ్యక్షతన కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి బోట్ల శేఖర్ ముఖ్య హాతిథిగా హాజరై మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు దళితులకు, ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అమలు చేయడం లేదని మండిపడ్డారు. పేదలైన దళితులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం లేదని అన్నారు. వెంటనే ఇల్లు లేని దళితులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, అలాగే వెంటనే దళిత మహిళ లకు మహాలక్ష్మి పథకం జాబ్ కార్డ్‌తో సంబంధం లేకుండా రూ. 2500 చెల్లించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని లేకుంటే కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో కెవిపిఎస్ మండల కార్యదర్శి గంధ మల్ల మనోహర్, మండల ఉపాధ్యక్షురాలు కొమ్ము శిరీష, శ్రీపతి నరేష్, బొట్టు దుర్గ భవాని, కర్రే ఉదయ్, కనకాచారి తదితరులు పాల్గొన్నారు.