కురవి, ఫిబ్రవరి 6 : ఇష్టపడిన రంగంలో మనసు లగ్నం చేసి కష్టపడితే ఉన్నతశిఖరాలు అధిరోహించవచ్చని నిరూపించాడు ఓ పాతికేళ్ల యువకుడు. తాను కలలు కన్న రంగుల ప్రపంచంలోకి ఎవరి అండా లేకుండానే అడుగుపెట్టాడు. కష్టాలెన్ని ఎదురైనా వాటిని అధిగమిస్తూ అంచెలంచెలుగా పైకొచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి సినీరంగంలో చోటు తనకంటూ స్థానం సంపాదించుకున్న అతడే మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన కొదుమూరి శ్రీనాథ్. చందూ మొండేటి దర్శకత్వంలో శ్రీనాథ్ అసిస్టెం ట్ డైరెక్టర్‌గా పనిచేయగా, అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి హీ రో హీరోయిన్లుగా నటించిన తండేల్ సినిమా శుక్రవారం విడుదల కానుంది.
వివరాల్లోకి వెళితే.. కురవిలో కిరాణా షాపు నడిపించుకుంటూ జీవనం సాగించే కొదుమూరి నాగమణి, వెంకటేశ్వర్లు దంపతులకు ఇద్దరు కుమారులు సాయినాథ్, శ్రీనాథ్, కుమార్తె నగ్మ ఉన్నారు. శ్రీనాథ్ పదో తరగతి చదువుతున్నప్పుడే సినిమాల వైపు మనసు మళ్లింది. తోటి స్నేహితుడు వీరేందర్తో కలిసి సినిమాల విషయమై చర్చించేవాడు. టెన్త్ పూర్తికాగానే తన స్నేహితులతో కలిసి షార్ట్ ఫిల్మ్‌లను నిర్మించడం.. అందులో నటించడం మొదలుపెట్టాడు. తన మనసులోని మాటను తల్లిదండ్రులకు చెబి తే వారు భయపడ్డారు. ముందు చదువుకోమని చెబితే హైదరాబాద్‌లోని నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్.. గురునానక్‌లో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. ఆ తర్వాత ఇంట్లో ఒప్పించి 2018లో సినిమా రంగంవైపు అడుగులు వేశాడు.
తొలుత జూనియర్ ఆర్టిస్టుగా..
ఓ మిత్రుడి సలహాతో కృష్ణానగర్ అడ్డా వద్ద జూనియర్ ఆర్టిస్ట్‌గా శ్రీనాథ్ ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ తరువాత మరో మిత్రుడి సూచనతో సెట్వర్క్లో పనిచేశాడు. శ్రీనాథ్‌ను చూసిన వారు అతడు చదువుకోలేదనుకునేవారు. అలాంటి సమయంలోనే ఓ మేకప్ ఉమెన్ శ్రీనాథ్‌ను పిలిచి అతడి చదువు విషయమై ఆరాతీసింది. తాను ఇంజినీరింగ్ పూర్తిచేశానని, డైరెక్టర్ కావాలనేది తన కోరిక అని చెప్పడంతో ఆ శాఖలోనే ప్రయత్నించాలని ఆమె సలహా ఇవ్వడంతో అటువైపు మళ్లాడు. ఇంట్లోవారు వద్దన్నా ఇష్టమైన రంగాన్ని ఎంచుకున్న శ్రీనాథ్ అనేక కష్టాలు పడ్డాడు.
అవకాశాలు రాక.. ఇంట్లో ఎలా చెప్పాలో తెలియక గ్రామానికి రావాలనుకున్న సమయంలో ఓ వాట్సాప్ గ్రూప్‌లో ‘బ్యాచ్‌లర్ పార్టీ’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ కావాలనే పోస్టు చూసి ప్రయత్నించాడు. ఎలాంటి డబ్బులు ఆశించకుండానే ఏడాదిన్నర సినిమా కోసం పనిచేశాడు. మధ్యలో అభిషేకంతో పాటు మరో రెండు డైలీ సీరియల్స్‌కు, రెండుమూడు చిన్న సినిమాలతో పాటు నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా వచ్చిన డెవిల్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా, చివరకు తండేల్ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. కాగా, తండేల్ సినిమా విజయవంతం కావడంతో పాటు శ్రీనాథ్‌కు మరిన్ని అవకాశాలు వచ్చి మంచి దర్శకుడిగా ఎదగాలని స్థానిక ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.