హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 3 : పింగళి కళాశాల రెండురోజుల జాతీయ సదస్సుకు సంబంధించిన పరిశోధన పత్రాలను సమగ్రపరిచిన ప్రత్యేక అంతర్జాతీయ గ్రంథాన్ని కేయూ కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రతాపరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పింగళి కళాశాల పరిశోధనాభివృద్ధి దిశగా తీసుకుంటున్న చర్యలను వీసీ అభినందించారు. సెప్టెంబర్‌లో 65 పరిశోధన పత్రాలతో మొదటి వాల్యూమ్ విడుదలైందని, తాజాగా 55 పత్రాలను కలిగి ఉన్న రెండో వాల్యూమ్‌ను అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురించామని తెలిపారు. వాణిజ్యం, నిర్వహణ రంగాల్లో కృత్రిమ మేధస్సు చేస్తున్న మార్పులు, దాని వలన ఉద్భవిస్తున్న అవకాశాలు-సవాళ్లను అర్థం చేసుకోవడంలో ఈ గ్రంథం విలువైన వనరుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఆర్థిక వ్యవస్థ, మానవ వనరుల నిర్వహణ, బ్యాంకింగ్, ఆర్థిక నివేదికల విశ్లేషణ వంటి విభాగాలకు ఈ పరిశోధన సంకలనం ఉపయోగపడుతుందన్నారు. విధానపరమైన నిర్ణయాల రూపకల్పనలో కృత్రిమ మేధస్సు పాత్రను స్పష్టంగా ప్రతిబింబించడం ఈ ప్రచురణల ముఖ్యఉద్దేశ్యమని డాక్టర్ రాజిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కంట్రోలర్ ప్రొఫెసర్ కట్ల రాజేందర్, పింగిళి ప్రిన్సిపాల్ బి.చంద్రమౌళి, వైస్ ప్రిన్సిపల్ జి.సుహాసిని, ఐక్యూఏసీ కో-ఆర్డినేటర్ సురేష్‌బాబు, అడిషనల్ కంట్రోలర్ శ్రీనివాస్, అధ్యాపకులు ప్రశాంతి, రత్నమాల, సురేష్ పాల్గొన్నారు.