హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 5: కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యుడు, తెలుగు విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ చిర్ర రాజుగౌడ్ని 2025 సంవత్సరానికి విద్యారత్న పురస్కార అవార్డుకి ఎస్ఆర్ఎఫ్ శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ వారు ఎంపిక చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం సెమినార్‌హాల్‌లో జరిగిన గురుపూజోత్సవ సన్మానం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న విశ్రాంత ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ, ఎస్.ఆర్.ఫ్ ఫౌండేషన్ రాష్ర్ట అధ్యక్షులు తుమ్మ అమరేష్ చేతులమీదుగా రాజుగౌడ్‌కు అవార్డును ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా తుమ్మ అమరేష్ మాట్లాడుతూ చిర రాజుగౌడ్ విద్యారంగంలో రెండు దశాబ్దాలకుపైగా బోధన అనుభవం కలిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విద్యారంగానికి విశేషమైన సేవలందించారని, విద్యార్థులను సమాజానికి ఉపయోగకరమైన జ్ఞానం అందించడం ద్వారా ఒక ప్రతిభావంతమైన విద్యావేత్తగా నిలిచారన్నారు.
ఎస్ఆర్ఎఫ్ శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా విద్యారంగంలో కృషి చేసిన సేవకు గుర్తింపుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యావేత్త చిర్ర రాజుగౌడ్కి ఈ సంవత్సరం విద్యారత్న అవార్డుని అందజేసినట్లు చెప్పారు. రాష్ర్టవ్యాప్తంగా 200 టీచర్స్‌కు గురుబ్రహ్మ అవార్డ్స్ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎస్.ఆర్.ఎస్ ఫౌండేషన్ అడ్వైజర్ చిరంజీవి, ఇతర సభ్యులు పాల్గొన్నారు.