నర్సంపేట, మే 4 : వరంగల్ జిల్లా నర్సంపేటకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం రానున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేటలో ఆర్టీసీ అమరుడి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ గత నెల 23న ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ నర్సంపేట బస్టాండ్‌లో అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మబలిదానం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా మంగళవారం సాయంత్రం 5.00 గంటలకు హైదరాబాద్ నుంచి ముత్తోజిపేటకు కేటీఆర్ చేరుకొని అమరుడి కుటుంబ సభ్యుల్లో ధైర్యాన్ని నింపనున్నారు. అనంతరం హనుమకొండకు చేరుకొని అక్కడే బస చేయనున్నారు. బుధవారం ఉదయం హనుమకొండ హంటర్‌రోడ్డులో నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సుకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.