ఎల్కతుర్తి, ఏప్రిల్ 23 : ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరగనున్న రజతోత్సవ సభ ఏర్పాట్లను బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. మధ్యాహ్నం సభాస్థలికి చేరుకున్న కేటీఆర్‌కు ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ప్రతినిధులు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఆ తర్వాత గ్రౌండ్ అంతా కేటీఆర్ క్షణ్ణంగా పరిశీలన చేశారు. సభ కోసం సేకరించిన భూమి ఎంత, అందులో పార్కింగ్, సభా ప్రాంగణానికి ఎంత కేటాయించారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరంగల్, కరీంనగర్, సిద్దిపేట రూట్లలో ఎక్కడ పార్కింగ్ స్థలాలు కేటాయించారు?, సభాస్థలికి ఎంత దూరంలో పార్కింగ్ కేటాయించారని ఆరా తీశారు. అలాగే పార్కింగ్, సభా స్థలానికి సంబంధించిన మ్యాప్‌ను కేటీఆర్‌కు చూపించి వివరాలు చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్ స్థలాల వద్ద వలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు.
వేసవి దృష్ట్యా సభకు ప్రజలకు తాగునీటికి లోటు రాకుండా చూసుకోవాలని చెప్పగా, 10 లక్షల వాటర్ బాటిళ్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు తెప్పిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. సభా ప్రాంగణంలోనే కాకుండా ప్రధాన రూట్లలో సైతం తాగునీరు, మజ్జిగ పాయింట్లు ఏర్పాటు చేయాలని కేటీఆర్ సూచించారు. మహిళలకు తాత్కాలిక టాయ్‌లెట్స్‌ను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని, విద్యుత్ సమస్య తలెత్తితే ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా వీలైనన్ని ఎక్కువ జనరేటర్లను వినియోగించాలని కేటీఆర్ సూచించారు. లైటింగ్, సౌండ్ సిస్టం, ఎల్ఈడీ స్క్రీన్ల గురించి తెలుసుకున్నారు. లక్షలాది మంది వస్తారు కనుక దూరంలో ఉన్న వారికి కూడా కేసీఆర్ స్పీచ్ స్పష్టంగా వినిపించేలా, కనిపించేలా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఎండ తీవ్రత దృష్ట్యా సభికులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే వైద్యం అందించేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అన్ని రూట్లల్లో అంబులెన్స్‌లతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. వీఐపీల వాహనాల పార్కింగ్, హెలీప్యాడ్ ల్యాండింగ్ స్థలాలను పరిశీలించారు. గత 20 రోజులుగా సభా ప్రాంగణంలో చేస్తున్న పనులపై కేటీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే సభాస్థలిలో చేయాల్సిన పలు పనులపై నేతలకు కేటీఆర్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు యువకులు, కార్యకర్తలు ఉత్సాహం చూపారు. సభావేదిక ముందు ఏర్పాటు చేసిన కేసీఆర్, కేటీఆర్‌ల కటౌట్ల ముందు కార్యకర్తలు ఫొటోలు దిగుతూ జై కేసీఆర్, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు.
సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తాటికొండ రాజయ్య, సత్యవతి రాథోడ్, డీ ఎస్ రెడ్యానాయక్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, వొడితెల సతీశ్‌కుమార్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, బానోత్ శంకర్‌నాయక్, నన్నపునేని నరేందర్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, నాగుర్ల వెంకటేశ్వర్లు, కె వాసుదేవారెడ్డి, గెల్లు శ్రీనివాస్, ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి,
మారెపల్లి సుధీర్‌కుమార్, నాయకులు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, మండల అధ్యక్షుడు పిట్టల మహేందర్, నాయకులు శ్రీపతి రవీందర్‌గౌడ్, ఎల్తూరి స్వామి, తంగెడ మహేందర్, గొల్లె మహేందర్, తంగెడ నగేశ్, పోరెడ్డి రవీందర్‌రెడ్డి, కడారి రాజు, మేకల స్వప్న, తంగెడ శాలిని, శ్రీపతి రమాదేవి, మునిగడప లావణ్య, పిడిశెట్టి రాజు, మదన్మోహన్రావు, కొమ్మిడి మహిపాల్‌రెడ్డి, శ్రీకాంత్‌యాదవ్, జూపాక జడ్సన్ గొడిశాల వినయ్, సాతూరి శంకర్, దేవేందర్‌రావు, దుగ్యాని సమ్మయ్య, శివాజి, చిట్టిగౌడ్, ప్రహ్లాదరావు, ఉట్కూరి కార్తీక్, భగవాన్, నవీన్, కొంగ ప్రవీణ్, రాజేశ్వర్‌రావు, మేరి, కృష్ణవేణి, భాగ్య తదితరులు పాల్గొన్నారు.