కరీమాబాద్, జూలై 6 : వరంగల్ ప్రజల కొంగు బంగారమైన భద్రకాళీ అమ్మవారికి త్వరలో బోనం సమర్పిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. భద్రకాళీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించే అంశం ఇటీవల వివాదాస్పదమైన విషయం తెలిసిందే. పండితులు, నగర ప్రజల నుంచి భద్రకాళీ అమ్మవారికి బోనం సమర్పించడంపై వ్యతిరేకత వచ్చింది. అధికార కాంగ్రెస్ పార్టీలోని ప్రజా ప్రతినిధుల మధ్య భద్రకాళీకి బోనం సమర్పించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భద్రకాళీకి బోనం సమర్పించడాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సురేఖ ప్రకటించారు. అయితే ఆదివారం కరీమాబాద్‌లో బీరన్న బోనాల పండుగకు హాజరైన ఆమె భద్రకాళీ బోనం సమర్పించడంపై పునరాలోచన చేసి త్వరలోనే ప్రకటిస్తామని వ్యాఖ్యలు చేయడం మళ్లీ భద్రకాళీ అమ్మవారికి బోనం అంశం తెరపైకి వచ్చింది. రాష్ట్రంలోనే తొలి బోనం భద్రకాళీ అమ్మవారికి సమర్పించాలని అనుకున్నామని సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం సహా కొన్ని కారణాల వల్ల ఆ సంకల్పం ఆగిపోయిందని చెప్పుకొచ్చారు. త్వరలో పునరాలోచన చేసి ప్రకటిస్తామన్నారు.
భద్రకాళీకి బోనాలు సమర్పించే అంశం ఇప్పటికే వివాదాస్పదమైంది. మళ్లీ అదే అంశాన్ని మంత్రి కొండా సురేఖ తెరపైకి తీసుకొచ్చారు. ఆగమశాస్త్రం ప్రకారం పూజలు, బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవం, శాకంబరీ ఉత్సవాలు జరిగే ఆలయంలో బోనాలు చేయడం సరైది కాదన్న అభిప్రాయాలు పండితులు వ్యక్తం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ అదే వివాదాస్పద అంశాన్ని ప్రస్తావించడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. బోనంపై త్వరలో ప్రకటిస్తామని చెప్పడం ప్రజల నమ్మకాలకు రాజకీయాలు అంటగట్టడమేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.