పరకాల, జూన్ 11: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బస్సు పాస్ చార్జీలను పెంచి పేదలపై పెను భారం మోపుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పరకాల పట్టణంలోని బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్ట ప్రజలకు ఫ్రీ బస్సులు అని తెలిపి పేద, మధ్యతరగతి ప్రజలపై భారం మోపుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం బస్ పాస్ చార్జీలను పెంచి విద్యార్థులపై పెనుభారం మోపిందని, పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు.
ఉచిత బస్ అంటూ మహిళలకు హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు విద్యార్థులపై భారీ చార్జీలను మోపుతోందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలన వల్ల జీవన వ్యయం ఇప్పటికే పెరిగిందని, ఇప్పుడు బస్సు చార్జీలతో విద్యార్థులకు మరింత భారమైందని పేర్కొన్నారు. పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించాలని, లేదంటే బీజేపీ రాష్ర్టవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుంద హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఖాళీప్రసాద్ రావు, పెసరు విజయచందర్ రెడ్డి, రాజకుమార్, ఎరుకల దివాకర్, చందుపట్ల రాజేందర్ రెడ్డి, కాచం గురు ప్రసాద్, దేవనూరి మేఘనాథ్, ఆర్పీ జయంత్ లాల్, మార్త రాజభద్రయ్య, కొలనుపాక భద్రయ్య, బెజ్జంకి పూర్ణ చారితదితరులు పాల్గొన్నారు.