హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 12: సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం సాధించినప్పుడే భారత ప్రజాస్వామ్యం సంపూర్ణంగా నిలుస్తుందని కోదండరాం అన్నారు. హక్కులతో పాటు బాధ్యతలు స్వీకరించాల్సిన అవసరం ఉందని, సామాజిక ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యతని ఉస్మానియా విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెసర్ ఎం. కోదండరాం అన్నారు. హనుమకొండలోని పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల(స్వయం ప్రతిపత్తి)లో ‘ఇండియా @2047 : రియలైజింగ్ ది విజన్ ఆఫ్ ఎ డెవలప్డ్ ఈక్విటబుల్ అండ్ సస్టైనబుల్ రిపబ్లిక్’ అంశంపై తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్, హైదరాబాద్ సహకారంతో రాజనీతి శాస్త్ర విభాగం నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి అధ్యక్షత జరిగిన ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా కోదండరాం పాల్గొని మాట్లాడారు.
విశిష్ట అతిథిగా డి.రమేష్ పట్నాయక్ పాల్గొని మాట్లాడుతూ భారత్ @2047 లక్ష్య సాధనలో విద్యాసంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. గౌరవఅతిథి ప్రొఫెసర్ దొంతి నరసింహారెడ్డి పర్యావరణ పరిరక్షణ సుస్థిర సమానత్వ దేశనిర్మాణానికి అవసరమన్నారు. ప్రిన్సిపాల్ బి. చంద్రమౌళి మాట్లాడుతూ స్వర్ణోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సదస్సులు విద్య, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు, పరిశోధనా ఆసక్తులను పెంపొందిస్తున్నాయని చెప్పారు. సెమినార్ కన్వీనర్ సామ్యూల్ ప్రవీణ్‌కుమార్ సదస్సు నివేదికను సమర్పిస్తూ 46 పరిశోధనా పత్రాలు అందాయని తెలిపారు. అతిథులను శాలువాలు, జ్ఞాపికలతో సన్మానించి పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. వివిధ కాలేజీల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.