కాశీబుగ్గ, జూన్ 21: తమ డిమాండ్లను పరిష్కరించాలని కేఎంసీ జూనియర్ డాక్టర్లు శుక్రవారం నలుపురంగు దుస్తులు ధరించి తరగతులకు హాజరయ్యారు. అనంతరం ఎంజీఎం దవాఖాన ఆవరణలోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దవాఖానకు వచ్చే పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలంటే తప్పనిసరిగా మౌలిక వసతులు కల్పించాలన్నారు. నెలనెలా ఉపకార వేతనాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని, దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల్లో సరిపడా బోధన, బోధనేతర సిబ్బంది, వైద్య పరికరాలు, భవనాలు, సదుపాయాలు లేవని, వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాకతీయ మెడికల్ కళాశాలలో అంత ర్గత రోడ్లు ప్రమాదకరంగా ఉన్నాయని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, సూపర్‌స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్స్ కోసం సవరించిన గౌరవ వేతనం ఇవ్వాలని, తమ డిమాండ్లను పరిష్కరించుకుంటే ఈ నెల 24 నుంచి అత్యవసర సేవలు మినహా విధులు బహిష్కరించి నిరవధిక సమ్మె చేస్తామని జూడాలు హెచ్చరించారు.