మహబూబాబాద్, మార్చి 3(నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లెందు, పినపాక, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు.
ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరై ఆయా నియోజకవర్గాల నేతల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే కొందరు నాయకులు హైదరాబాద్కు చేరుకోగా, మరి కొంతమంది సోమవారం వెళ్లనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలోనే బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి ఎవరనేది వెల్లడి కానుంది.