తరిగొప్పుల, జనవరి 7 : రైతాంగానికి ఎంతో దోహదపడే సాగునీటి ప్రాజెక్టులకు అడ్డుపడితే ఊరుకునే ప్రసక్తే లేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం తరిగొప్పుల మండలకేంద్రంలో దేవాదుల మినీ ఎత్తిపోతల పథ కం పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ర్టాన్ని అన్నపూర్ణగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. వ్యవసాయరంగంలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలిపింది కేసీఆరేనని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకున్నారని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతోనే తాను ఎమ్మెల్యే అయ్యాయని, వారి రుణం తీర్చుకుంటానని పేర్కొన్న పల్లా.. అధికారం ఉన్నా లేకున్నా అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు.
తరిగొప్పుల మండలంలోని 52 చెరువులకు సాగునీరు అందించేందుకు మొదటి లిఫ్ట్ పనులను పునః ప్రారంభించామని, 15 గ్రామాల్లోని ప్రతి చెరువులోకి రెండు పంటలకు కావాల్సిన నీళ్లు వస్తాయని చెప్పారు. రైతులు జీవితకాలం తమ వ్యవసాయాన్ని ఒక పండుగలా చేసుకునే భాగ్యం కలిగిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కృషి, అధికారుల సహకారంతో రూ.104 కోట్లు లిఫ్టు ఇరిగేషన్ సిస్టర్న్ మంజూరైందని తెలిపారు. మండలం నుంచి పరిసర ప్రాంతాల్లోని 80 శాతం భూభాగానికి నీరందించేలా పనులు కొనసాగుతున్నాయని అన్నారు. సిస్టర్న్ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా కృషి చేస్తామన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏడాదికి రెండు సార్లు రైతుబంధు అందిందని, ఇచ్చిన మాట నిలుపుకొన్న మహానేత కేసీఆర్ అని గుర్తుచేశారు. అయితే మార్పు అనగానే ప్రజలు ఉత్సాహంగా కాంగ్రెస్‌కు ఓట్లేశారని, కాని ఏడాది గడవక ముందే, ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందన్నారు. అన్ని రంగాల్లో రేవంత్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు ప్రతి గడపకు అందాయని, ముఖ్యంగా సాగు, తాగునీటి రంగాల అభివృద్ధికి కేసీఆర్ చేసిన కృషి ప్రశంసనీయమని అన్నారు. ప్రజలు, రైతులు ఇప్పటికీ కేసీఆర్‌నే గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాజీ మంత్రి కేటీఆర్‌పై కుట్రపూరితంగా కేసులు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నదని ఎమ్మెల్యే పల్లా మండిపడ్డారు.
సంబురాల్లో రైతులు
లిఫ్ట్ పనులు ప్రారంభించడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, మహిళలు, యువకులు భారీగా తరలిరావడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే పల్లా ప్రత్యేక దృష్టి సారించడంపై అభినందనలు తెలియజేసి రైతులు.. బీఆర్ఎస్కు, ఎమ్మెల్యే పల్లాకు జీవితాంతం రుణపడి ఉంటామని చెబుతున్నారు. ఈ సందర్భంగా రైతులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే పల్లా నృత్యం చేసి సంబురాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పింగిళి జగన్మోహన్రెడ్డి, జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, అధికార ప్రతినిధి చిలువేరు లింగం, గ్రామశాఖ అధ్యక్షులు అంకం రాజారాం, మాజీ జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, నాయకులు గద్దల నర్సింగరావు, తేజావత్ గోవర్దన్, ముద్దసాని పద్మజ, వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీపీ జొన్నగాని హరిత సుదర్శన్‌గౌడ్, గౌస్, పెద్ది రాజిరెడ్డి, వంగ రామారాజు, జూంలాల్‌నాయక్, సంజీవ, రాజు, సతీష్, సుధీర్,కుమార్, చందునాయక్, బుచ్చిరాజు, పోశయ్య, ప్రభుదాసు పాల్గొన్నారు.