వరంగల్, జూలై 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారతీయ రైల్వేలో కాజీపేట ఇప్పుడు గర్వించదగిన భాగస్వామిగా మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కాజీపేట రైల్వే వ్యాగన్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌కు హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ నుంచి వర్చువల్ విధానం ద్వారా శనివారం శంకుస్థాపన చేయడంతో పాటు రెండు జాతీయ రహదారుల విస్తరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగిస్తూ దేశాభివృద్ధికి తెలంగాణ అందిస్తున్న సహకారం గొప్పదని చెప్పారు. భద్రకాళీ మహత్యాన్ని, సమ్మక్క-సారలమ్మ పౌరుషాన్ని, కాకతీయ యోధురాలు రాణి రుద్రమదేవి పరాక్రమాన్ని ప్రస్తావించారు. అంతకుముందు భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
భారతీయ రైల్వేలో కాజీపేట ఇప్పుడు గర్వించదగిన భాగస్వామిగా మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. హనుమకొండ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ.521 కోట్లతో కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌కు శంకుస్థాపన, రూ.2147 కోట్లతో జగిత్యాల-కరీంనగర్-వరంగల్, రూ.3441 కోట్లతో మంచిర్యాల-వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ప్రధాని ప్రసంగిస్తూ కాజీపేట వ్యాగన్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లో నెలకు 200 వ్యాగన్లు ఉత్పత్తి అవుతాయన్నారు. ఈ యూనిట్ ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. వరంగల్‌కు రావడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. దేశాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం అందిస్తున్న సహకారం గొప్పదన్నారు. భారతదేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోవడంలో తెలంగాణ ప్రజలది కీలకపాత్ర అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు కేంద్రంగా ఉన్నదని, ఇక్కడ పెట్టుబడుల పర్వం కొనసాగుతున్నదని చెప్పారు. ప్రపంచానికి సవాలుగా మారిన కరోనాకు వ్యాక్సిన్‌ను తెలంగాణ రాష్ట్రంలోనే తయారు చేశారని గుర్తుచేశారు. తెలంగాణలో ముఖ్యమైన చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలున్నాయని, తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిచారు. కాజీపేటలో 160 ఎకరాల్లో వ్యాగన్ల తయారీ యూనిట్‌ను నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ యూనిట్లో ఏటా 2400 వ్యాగన్లను తయారు చేసేలా వసతులు ఉంటాయన్నారు. రైల్వే శాఖ రూ.350 కోట్లతో హైదరాబాద్-యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టును, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నదని చెప్పారు.