కాజీపేట, ఏప్రిల్ 10 : దక్షిణ మధ్య రైల్వే జోన్, సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోని కాజీపేట-పెద్దంపేట రైల్వే స్టేషన్ మధ్య శుక్రవారం కవచ్ లోకోల ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. భారతీయ రైల్వే స్వదేశీ భద్రతా సాకేతికతను బలోపేతం చేయడం కోసం సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోని ముఖ్యమైన కాజీపేట- బలార్హ సెక్షన్‌లోని కాజీపేట-పెద్దంపేట రైల్వే స్టేషన్ సెక్షన్ల మధ్య 101 కిలోమీటర్ల కవచ్ వ్యవస్థను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది.
ఈ మేరకు శుక్రవారం మొదటిరోజు కవచ్ ట్రయల్ రన్లో భాగంగా రెండు లోకో(రైలింజన్)లలో వేర్వేరుగా ఎక్యూప్మెంట్ సెటప్ సిస్టంను ప్రాజెక్టు అధికారులు ఏర్పాటు చేశారు. ఈ ట్రయల్ రన్‌ను డీఎస్టీఈ ప్రాజెక్టు యుగేంధర్, లోకో ఇన్స్పెక్టర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, హెచ్‌బీఎల్ కంపెనీ బృందం ఆధ్వర్యంలో జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట రైల్వే జంక్షన్లో ప్రారంభమైన ట్రయల్ రన్‌ను హసన్‌పర్తి, జమ్మికుంట, బీజగిరిషరీఫ్, పోత్కపల్లి రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. ఈ ట్రయల్ రన్లో ఒకే లైన్ పట్టాలపై రెండు లోకోలను ఎదురెదురుగా ప్రాజెక్టు బృందం అధికారులు నడిపించారు.
కవచ్ ట్రయల్ రన్లో ఒక్కో రైల్వే స్టేషన్ మధ్య ఒక విభాగంలో హెడ్ ఆన్ కొలిజన్ టెస్ట్, సైడ్ కొలిజన్ టెస్ట్, అనుకోకుండా జరిగే ప్రమాదాల నివారణ టెస్ట్, లోకోల బ్రేక్ ఫవర్ టెస్ట్ చేశామని సంబంధిత అధికారులు చెప్పారు. ఈ సందర్బంగా ప్రాజెక్టు అధికారులు మాట్లాడుతూ.. రెండు రైళ్లు ఒకే రైలు పట్టాలపై ఉంటే మూడు కిలో మీటర్ల దూరంలోనే సిగ్నల్ ఇండికేషన్ వచ్చిందని తెలిపారు. భవిష్యత్‌లో మానవ తప్పిదంతో ఎలాంటి రైలు ప్రమాదాలు జరగవని కవచ్ ట్రయల్ రన్ టెస్ట్‌తో తేటతెల్లమైందన్నారు. ఈ ట్రయల్ రన్ ప్రారంభోత్సవంలో కాజీపేట రైల్వే స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, రిటైర్డ్ సీనియర్ సెక్షన్ ఇంజినీర్, సిగ్నల్ ప్రాజెక్టు పీఎంఎస్ రామిండ్ల సారంగపాణి, రిటైర్డ్ సీనియర్ సెక్షన్ ఇంజినీర్ టెలి, ప్రాజెక్టు పీఎంఎస్ సంపతి పాల్గొన్నారు.