భీమదేవరపల్లి, ఫిబ్రవరి 28 : భీమదేవరపల్లి మండలం వంగరలో కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కాన్వాయ్‌పైకి గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం కోడిగుడ్లు రువ్వారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన బండి సంజయ్ తనకు బందోబస్తు అక్కర్లేదని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన బండి, గట్లనర్సింగాపూర్, వంగర, ముల్కనూరులో ప్రజాహిత యాత్ర చేపట్టారు. వంగరలో మ్యూజియంగా మార్చిన పీవీ ఇంటిని సందర్శించారు. పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూ ఉమ్మడి ఏపీ నుంచి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ మహనీయుడన్నారు. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని ముందుకు నడిపించారని కొనియాడారు. విశ్వనాథ సత్యనారాయణ రాసిన ‘వేయిపడగలు’ పుస్తకాన్ని పీవీ హిందీలో అనువదించారని గుర్తు చేశారు. ఆయనను రాబోయే తరాలు స్మరించుకోవాలనే ప్రధాని మోదీ పీవీకి భారతరత్న అందించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా దేశంలో మిగిలి ఉందంటే అదీ పీవీ చొరవ వల్లేనన్నారు. పీవీ ఆలోచనతోనే ఆపార్టీ శక్తివంతంగా తయారైందని చెప్పారు. అంతటి గొప్ప వ్యక్తి చనిపోతే అంత్యక్రియలు చేయకుండా అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ ఎలా అవమానించిందో తెలుగు ప్రజలు చూశారని గుర్తుచేశారు. కేంద్రం పీవీకి భారత్నరత్న ఇచ్చి గౌరవిస్తే కాంగ్రెస్ పార్టీ కనీసం హర్షం కూడా వ్యక్తం చేయలేదన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్‌ను కూడా కాంగ్రెస్ పార్టీ అవమానించిందన్నారు. అంబేద్కర్‌ను ఎన్నికల్ల్లో ఆ పార్టీ ఓడగొట్టిందని చెప్పారు. బీఆర్ అంబేద్కర్ పుట్టిన, చదివిన, చనిపోయిన స్థలాలను స్ఫూర్తిదాయక కేంద్రాలుగా మోదీ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, నాయకులు జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, పృథ్వీరాజ్, నోముల భిక్షపతి పాల్గొన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఎంపీ బండి సంజయ్‌కి ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. రాజకీయాల్లో కుటుంబపరమైన విమర్శలు చేయడం బాధాకరమన్నారు. బండి సంజయ్ ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించాలని ప్రశ్నిస్తే పొంతనలేని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఎల్కతుర్తి : కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోతే ప్రజలే తిరగబడతారని ఎంపీ బండి సంజయ్ హెచ్చరించారు. ప్రజాహిత యాత్రలో భాగంగా బుధవారం ఎల్కతుర్తి మండలంలోని గోపాల్పూర్, చింతలపల్లి, దామెర, ఎల్కతుర్తి, సూరారం, దండేపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డులున్న వారికే గ్యారెంటీలను అందిస్తామని చెప్పడం సరికాదని, రేషన్ కార్డులే ఇవ్వకపోతే ఎక్కడినుంచి వస్తాయని ప్రశ్నించారు. ఓ కాంగ్రెస్ పెద్ద మనిషి అమ్మను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడని, అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. 100 రోజుల్లో హామీలు అమలు చేయకపోతే రాష్ట్రమంతా తిరిగి కాంగ్రెసోళ్లకు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు.