హనుమకొండ చౌరస్తా, మే 20: మా పూర్వీకులు నిర్మించిన చారిత్రక రుద్రేశ్వర ఆలయానికి రావడం ఇది రెండోసారి అని కాకతీయుల వారసుడు కమల్‌చంద్ర బంజ్ దేవ్ అన్నారు. హన్మకొండలోని చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయాన్ని 22వ కాకతీయరాజు కమల్‌చంద్ర బంజ్‌దేవ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మా పూర్వీకులు నిర్మించిన అనేక దేవాలయాలు హైదరాబాద్‌లోని కర్మాన్‌ఘాట్ నుంచి ఏపీలోని కర్నూల్ జిల్లా అహోబిలం క్షేత్రం అటు తమిళనాడు, కర్ణాటక వరకు అనేక దేవాలయాలు నిర్మించారన్నారు. వాటి పునర్నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు.
తెలంగాణలో భారతీయ సాంస్కృతి సంప్రదాయాలు చక్కగా గౌరవించబడతాయని వ్యాఖ్యానించారు. అంతకుముందు వారికి ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఆలయ నాట్యమండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, యువ చరిత్రకారుడు అరవింద్ ఆర్య, పులి రజినీకాంత్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టం నుంచి రాజు భద్రత సిబ్బంది ఉన్నారు. ఆలయ ప్రాశిస్తాన్ని అరవింద్ వివరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్ ఘనంగా సత్కరించారు. మణికంఠశర్మ ప్రణవ్, శ్రవణ్, కాశీలింగాచారి, ఆలయ సిబ్బంది మధుకర్ పాల్గొన్నారు.