సుబేదారి, ఫిబ్రవరి 24: పేదింటి ఆడబిడ్డ పెళ్లి కానుకగా సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ, సంగెం మండలాలకు చెందిన 107 మంది లబ్ధిదారులకు రూ. 1.70 కోట్ల విలువైన చెక్కులను గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని ఆయన నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లి భారం కాకుండా ఉండేందుకు కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని వివరించారు. సీఎం కేసీఆర్ గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి సాగు, తాగునీటిని అందిస్తున్నారని తెలిపారు. దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ఓర్వలేకనే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని చెప్పారు. వారి విమర్శలను ఎన్నికల్లో తిప్పికొట్టి సీఎం కేసీఆర్కు అండగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో గీసుగొండ, సంగెం మండలాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు.