ఎల్కతుర్తి, ఏప్రిల్ 24 : ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే రజతోత్సవ సభ దేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని, ఇక్కడ చేస్తున్న ఏర్పాట్లు చాలా బాగున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో మోసపోయిన ప్రతి ఒక్కరూ ఈ సభకు తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు. గురువా రం ఎల్కతుర్తిలోని సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిపై ఆరా తీయడంతో పాటు మహిళలకు ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడుతూ తెలంగాణ బాగుండాలని బీఆర్ఎస్, కేసీఆర్ అనుకుంటారని, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాత్రం ఓట్లు బాగా రావాలని కోరుకుంటారని విమర్శించారు. ఆ రెండు పార్టీ లు ప్రజల మధ్య చీలిక తీసుకొచ్చి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తాయన్నారు. రజతోత్సవం ఎందుకు జరుపుకుంటున్నారని కొంత మంది వెకిలిమాటలు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ నాయకుల్లారా ఖబడ్దా ర్.. ప్రజలకు మీ నైజం తెలిసిపోయిందన్నారు. 16 నెలల పాలనలో 16 పనులు కూడా చేయలేదని మండిపడ్డారు. దేశానికి సేవ చేయడానికే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతంరం చెందిందన్నారు. కాంగ్రెస్ నాయకులు అవాకులు, చెవాకులు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని, ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతులు గుండెలపై చేయి వేసుకొని పడుకునే పరిస్థితిని కేసీఆర్ సృష్టిస్తే, దానిని ఎండబెట్టి లక్షలాది ఎకరాలను బీడుగా మార్చింది కాంగ్రెస్ ప్రభు త్వం కాదా? అని ప్రశ్నించారు. తెలంగా ణ అస్తిత్వం కోసం 2001లో కేసీఆర్ పిడికిలి బిగించి ఉద్యమాన్ని మొదలు పెట్టినప్పుడు ఉత్పన్నమైన అన్ని అనుమానాలను ప టాపంచలు చేశారని గుర్తు చేశారు. ఒక్క చుక్క రక్తం చిందకుండా రాష్ట్రం సాధించిన ధీరుడు కేసీఆర్ అని కొనియాడారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా గుండె ధైర్యంతో బీఆర్ఎస్ను, తెలంగాణను కాపాడుతూ వచ్చారన్నారు. రాజకీయ కుట్రలను ఛేదించి తెలంగాణ వాదాన్ని ప్రజల్లో నిలబెట్టారని, 36 పార్టీల మద్దతును కూడగట్టారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ చేయని నయవంచన లేదని, 2004లో తెలంగాణ ఇస్తామని మోసం చేసిందని, దాని ఫలితంగా 1400 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే పదేళ్ల తర్వాత రాష్ర్టాన్ని ఇచ్చారన్నారు. బీఆర్ఎస్లోని మహిళా నాయకత్వాన్ని పటిష్టం చేసేందుకు కేసీఆర్ రోడ్ మ్యాప్ ఇచ్చారని చెప్పారు. మహిళా సాధికారతకు కేసీఆర్ బాటలు వేశారని, మున్సిపాలిటీలు, మార్కెట్ కమిటీల్లో వారికి రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆడపిల్లల కోసం ప్రతి జిల్లాలో హాస్టల్‌తో కూడిన డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేశారని, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి పథకాలు అమలు చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇస్తామన్న నెలకు రూ. 2500, తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీల జాడేదని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజల విజయాన్ని ప్రపంచానికి చాటడానికే బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరుపుతుందని కవిత పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, సుంకె రవిశంకర్, నన్నపునేని నరేందర్, చంద్రావతి, రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, వాసుదేవరెడ్డి, లలితాయాదవ్, మహిళా నాయకురాళ్లు రజినీ, శ్రీదేవి, రమాదేవి, చారులత, మాధ వి, హర్షిణి, వసంత, మేకల స్వప్న, శ్రీపతి రమ, తంగెడ శాలిని, మునిగడప లావణ్య, రాజ్యలక్ష్మి, పావనిగౌడ్ పాల్గొన్నారు.
హనుమకొండ, ఏప్రిల్ 24 : ‘ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ చరిత్రలో నిలుస్తుంది.. తెలంగాణ ప్రస్తావన వచ్చినప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ ప్రస్తావన లేకుండా తెలంగాణ ఉండదు. ఓరుగల్లు గడ్డ నుంచి ఆ మహనీయుడిని తలుచుకోవడం మన అందరి బాధ్యత.. వారు తెలంగాణ భావజాలాన్ని బతికించి అందిస్తే.., ఆయన ఉద్యమ స్ఫూర్తిని కేసీఆర్ కొనసాగించి రాష్ర్టాన్ని సాధించి తన దక్షతను చాటుకున్నారు’ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి రూపొందించిన ‘ఎగిసెర బలే ఎగిసెర సారే రావాలంటూ ఓరుగల్లు పిలిచెర’ అనే పాట సీడీ ఆవిష్కరణ హనుమకొండ సుబేదారిలోని ఎస్ఆర్ కన్వెన్షన్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా ఆమె హాజరై పాట సీడీని ఆవిష్కరించారు. అలాగే రిటైర్డ్ తహసీల్దార్ మహమ్మద్ సిరాజుద్దీన్ రచించిన పాటను సైతం ఆవిష్కరించి ఇద్దరిని అభినందించారు.
అనంతరం కవిత మాట్లాడుతూ.. బీఆర్ఎస్ 14 ఏళ్ల పోరాటం, 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని విలసిల్లేలా చేసి, దేశంలో నంబర్‌వన్ రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మన తెలంగాణ యాసలో మాట్లాడితే హేళనగా చూసేవాళ్లని, కానీ, స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత 10 ఏళ్ల స్వపరిపాలనలో మన యాస, భాషకు ప్రాభవం పెరిగిందన్నారు. 2001లో కేసీఆర్ ఉద్యమం మొదలు పెట్టిన తర్వాత మన యాసను సగర్వంగా మైకుల ముందు మాట్లాడే పరిస్థితి వచ్చిందని తెలిపారు. దేశంలోనే బీఆర్ఎస్ పార్టీ చరిత్ర సృష్టించిందని, గత 25 ఏళ్లలో రెండు ప్రాంతీయ పార్టీలు మాత్రమే మనుగడలో ఉన్నాయ ని, అందులో ఒకటి టీడీపీ, ఇంకోటి బీఆర్ఎస్ అని, అలాంటి ఉద్య మ పార్టీ రజతోత్సవ సభ ఘనంగా నిర్వహించబోతున్నట్లు చెప్పారు. సభను విజయవంతం చేయడంకోసం సోదరుడు రాకేశ్‌రెడ్డి ముందుపడి గొప్పగా పాటను రూపొందించడం చాలా సంతోషమన్నారు. అనంతరం రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పాట తెలంగాణ ప్రజల ప్రా ణం, పేద ప్రజల పేగు బంధం, వందల ప్రసంగాల సారాన్ని ఒక పాట చెబుతుందన్నారు.
ఈ పాట గిరిజనుల దరువు నుంచి, హరిజనుల దండోరా నుంచి, గొల్ల కురుమల డోలు నుంచి, ఢమరుకం నుంచి, ఆడబిడ్డల మువ్వల సవ్వడి నుంచి, కాలే కడుపుతో వంగి నాట్లేస్తున్న తల్లి పొత్తిళ్ల నుంచి పుట్టిందన్నారు. అందుకే ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన పాటలో పౌరుషం తొణికిసలాడుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఒక యుద్ధ నౌక అయితే వారి తూటాల్లాంటి మాటలు వలస దోపిడీదారులపై పేలిన ఫిరంగులని అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఈ పాటను అంకితం ఇవ్వాలని రూపొందినట్లు తెలిపారు. కార్యక్రమంలో భారత జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాస్యం విజయ్‌భాస్కర్, రజనీసాయిచంద్, గాయకుడు మానుకోట ప్రసాద్, పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య, సిరికొండ ప్రశాంత్, కవి ఎండీ సిరాజొద్దీన్ పాల్గొన్నారు.