మహబూబాబాద్ సెప్టెంబర్ 7 నమస్తే తెలంగాణ : ‘వానమ్మ వానమ్మా.. వానమ్మ.. ఒకసారైన వచ్చిపోవే.. వానమ్మ..’ అంటూ వర్షాన్నే కరిగించిన అక్షరాలు అతడివి.. ‘వందనాలమ్మా.. అమ్మా వందనాలమ్మా’ అంటూ తల్లి ప్రేమను తెలంగాణ ప్రజలకు అందించి అందరి మనసులో చెరగని ముద్ర వేసిన రచనా శైలి ఆయనది.. ఎర్రపూల వనంలో విప్లవ పాటల రారాజు అయిన గొడిశాల జయరాజ్‌ను ఈ యేడు కాళోజీ నారాయణరావు అవార్డు వరించింది. ఈనెల 9న కాళోజీ జయంతి సందర్భంగా హనుమకొండలోని హరిత హోటల్లో జరిగే ఉత్సవాల్లో మానుకోట జిల్లాకు చెందిన జయరాజ్‌కు పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ప్రశంసా పత్రం, జ్ఞాపిక, రూ.1,01, 116 నగదు పురస్కారాన్ని అందించనున్నారు. పద్మ విభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా పురస్కారాన్ని ప్రదానం చేస్తుండగా, 2023 సంవత్సరానికి గాను ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్‌ను ఎంపిక చేయడంపై ఉమ్మడి జిల్లావాసులే కాకుండా, యావత్ తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ప్రభుత్వం ప్రతి ఏడాది ఈ అవార్డు అందిస్తున్నది.
మానుకోట నుంచి ఎదిగి..
మహబూబాబాద్ పట్టణంలోని గుమ్మడూరు ప్రాంతానికి చెందిన గొడిశాల చెన్నమ్మ, కృష్ణమూర్తి దంపతుల పుత్రుడు జయరాజ్. బయ్యారం మండలం గంధంపల్లి హైసూల్లో పదో తరగతి దాకా చదివారు. మహబూబాబాద్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చేస్తూ మధ్యలోనే ఆపి, కొత్తగూడెంలో ఐటీఐ పూర్తి చేశారు. అనంతరం సింగరేణిలో ఉద్యోగం సాధించి ప్రస్తుతం హైదరాబాద్‌లోని సింగరేణి కార్యాలయంలో పనిచేస్తున్నారు. కష్టాల్లోనే పెరిగిన జయరాజ్ చిన్నప్పటి నుంచే కవిగా గుర్తింపుపొందారు. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన జయరాజ్ వివక్ష లేని సమ సమాజం కోసం తన పాటల ద్వారా చైతన్యం తెచ్చారు. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో, సింగరేణి ఉద్యమంలో, విప్లవ ఉద్యమంలో, సామాజిక ఉద్యమాల్లో తనదైన శైలిలో సాహితీ సృజన చేశారు. ప్రకృతి గొప్పతనాన్ని వర్ణిస్తూ, పర్యావరణ పరిరక్షణ కోసం పలు పాటలు రాశారు.
ప్రజల నోళ్లలో జయరాజ్ పాటలు
జయరాజ్ ప్రకృతి మీద 122 కథలు, గేయాలతో రాసిన ‘అవని’ పుస్తకం హిందీ, ఇంగ్గిష్, కన్నడ సహా అనేక భాషల్లోకి అనువాదమై విస్తృత ప్రాచుర్యం పొందింది. ఆర్.నారాయణ మూర్తి నిర్మించిన దండోరా సినిమాలో జయరాజ్ రాసిన ‘కొండల్లో కోయిల పాటలు పాడాలి.. పల్లెల్లో అక్షర జ్యోతులు వెలగాలి’ అనే పాట, ‘అడవిలో అన్న’ సినిమాలో ‘వందనాలమ్మా.. అమ్మా వందనాలమ్మా’ అనే పాటతో పాటు ఆయన రాసిన 25 సినిమా పాటలు ప్రజల నోళ్లలో ఇప్పటికీ నానుతున్నాయి. జయరాజు రాసిన ‘వానమ్మ.. వానమ్మా..వానమ్మ.. ఒకసారైనా వచ్చి పోవే వానమ్మ” అందరికీ సుపరిచతమే.. సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో కాటగలిసిన తెలంగాణ సంస్కృతిపై ఆయన అనేక ధూంధాం సభల్లో తన గళాన్ని వినిపించారు.
కాళోజీ పురస్కారం నా అదృష్టం
ప్రజా కవి కాళోజీ నారాయణరావు తెలంగాణకు తండ్రిలాంటి వారు. తన జీవితాంతం ప్రజల కోసం పని చేశారు. అలాంటి గొప్ప కవి పేరుమీద ప్రతి ఏటా ఇచ్చే పురస్కారం ఈ ఏడాది నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ అవార్డుకు సీఎం కేసీఆర్ నన్ను ఎంపిక చేసినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. నా జీవితాంతం కాళోజీలానే తెలంగాణ కోసం పని చేస్తా. మారుమూల మహబూబాబాద్ జిల్లాలో పుట్టి, అతిపేద కుటుంబం నుంచి వచ్చిన నాకు ఈ అవార్డు రావడం చాలా గర్వంగా ఫీలవుతున్నా. ఈ అవార్డుతో నా బాధ్యత మరింత పెరిగింది.
– గొడిశాల జయరాజ్, ప్రజా కవి, రచయిత