కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ ప్రగతి ఆశాజనకంగా లేదు. అభివృద్ధి పనులు ఎక్కడికక్క డే నిలిచిపోయాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి 2016లో రూ. 25 కోట్లు మంజూరు చేయగా అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్నాయి. అధికారంలో కి వచ్చిన కాంగ్రెస్ సర్కారు పది నెలల్లో పైసా విదల్చకపోవడంతో నిర్మాణాలు నిలిచిపోయాయి.
అదేవిధంగా ఆలయ పాలకవర్గం పదవీకాలం పూర్తయి ఏడాది సమీపిస్తున్నా దానికి ఇంత వరకు మోక్షం లేదు. మరోవైపు ఇన్చార్జి ఈవోనే దిక్కయ్యారు. ఇదీ మంత్రి శ్రీధర్‌బాబు ఇలా కాలో నెలకొన్న దుస్థితి. మేలో సరస్వతీ పుష్కరాలు ప్రారంభం కానుండగా, ఈ లోగా ప్రభు త్వం నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు.
– జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ)
మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసి 32 పనులు చేపట్టి, వీటి పర్యవేక్షణ బాధ్యతలను దేవాదాయ, పంచాయతీరాజ్, అటవీ, ఉద్యానశాఖ, సులభ్ ఇంటర్నేషనల్ సంస్థకు అప్పగించింది. ఆలయం ఎంట్రన్స్‌కు ముందు ఫ్లోరింగ్, కిచెన్ హాలు, యాత్రికుల కోసం 15 గదులతో సముదాయం, క్యూ, షాపింగ్ కాంప్లెక్స్, పదిహేను గదులతో అపర కర్మ మండపం, వంద గదులతో ధర్మశాల, నలభై గదులతో డార్మిటరీ హాల్, గోదావరి స్నానఘట్టాల నుంచి బస్‌స్టేషన్ వరకు చేపట్టే డ్రైనేజీ, రోడ్డు నిర్మాణం, ఆలయం చుట్టూ ప్రహరీ, తదితర పనులకు నిధులు మంజూరు చేయగా, కొన్ని సాంకేతిక కారణాలతో ప్రారంభం కాకపోగా అధిక శాతం పనులు చివరి దశకు చేరుకున్నాయి.
వంద గదులతో ధర్మశాల
రూ. 8 కోట్లతో ఆలయం సమీపంలో భక్తుల సౌకర్యార్థం వంద గదులతో ధర్మశాల నిర్మాణం చేపట్టారు. ఈ భవనంతో పాటు రూ.1.25 కోట్లతో చేపట్టిన 40 గదుల డార్మెటరీ హాలు పనులు 90 శాతం పూర్తయ్యాయి. రూ. 1.10 కోట్లతో నిర్మించిన కిచెన్, అన్నదానం హాలు, రూ. కోటితో ఏర్పాటు చేసిన క్యూ కాంప్లెక్స్ పనులు పూర్తి చేసి ప్రారంభించారు. అపర కర్మ మండపానికి రూ.1.50 కోట్లు మంజూరు చేయగా స్థల సమస్యతో పనులు ప్రారంభం కాలేదు.
రూ.50 లక్షలతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, రూ. 3.75 కోట్లతో అనిశెట్టి మండపం, రూ. 40 లక్షలతో అభిషేకం మండపం, రూ.11 లక్షలతో పాకశాల అభివృద్ధి, రూ.19 లక్షలతో శివ కల్యాణ మండపం, రూ.26 లక్షలతో రామాలయం ప్రహరీ, కొత్త ధ్వజ స్తంభం, రాజగోపురాలకు కర్ర డోర్లు, సాలహారం, సరస్వతీ ఆలయ ప్రహారీ తదితర పనులు సైతం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు పెండింగ్ పనులకు నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేయాల్సి ఉంది.
రాష్ట్రంలో కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంపై పాలకులు అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం పెండింగ్ పనులు కూడా పూర్తి చేయరా అని మండిపడుతున్నారు. పదినెలల కాలంలో కనీసం పాలకవర్గాన్ని ఎన్నిక చేయలేని, పర్మినెంట్ ఈవోను నియమించలేని ఈ పాలకులు ఆలయ అభివృద్ధిని ఏం చేస్తారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి సొంత నియోజక వర్గంలో నిధుల కొరతతో అభివృద్ధి పనులు ఆగిపోవడం గమనార్హం.