హనుమకొండ బస్టాండ్ సర్కిల్లోని కమర్షియల్ కాంప్లెక్స్‌ను కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) స్వాధీనం చేసుకుంది. లీజు ప్రతిపాదనకు ప్రభుత్వ అనుమతి రాకముందే.. ప్రతిపాదనలో ఉన్న వ్యక్తి ఈ భవనంలో పనులు చేపట్టాడు. అనుమతి, అగ్రిమెంట్ తర్వాతే పనులు చేపట్టాలని పేర్కొంటూ సదరు వ్యక్తికి కుడా మూడు నెలల క్రితం మొదటి నోటీస్ పంపింది. అయినా పనులు కొనసాగించడంతో రెండోసారి నోటీస్ ఇచ్చింది. అనుమతి, అగ్రిమెంట్ లేకుండా పనులు చేయడంతో పాటు భవనాన్ని తనకే లీజుకు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆ వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిసింది. అగ్రిమెంట్‌కు ముందే పనులు చేపట్టడంతో చివరి చర్యగా కుడా భవనంపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఆవరణలోకి వచ్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నది.
వరంగల్, జూలై 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఆధ్వర్యంలోని విశాలమైన భవనం లీజు ప్రక్రియ కొత్త మలుపు తిరిగింది. హనుమకొండ బస్టాండ్ సర్కిల్లోని భవనాన్ని ఎవరికీ కేటాయించలేదని.. దీని ఆవరణలోకి ఎవరైనా వస్తే చట్టపరంగా చర్య లు తీసుకుంటామని పేర్కొంటూ ఈనె ల 16న కుడా అధికారులు ఫ్లెక్సీ ఏర్పా టు చేశారు. ప్రభుత్వ పరంగా అనుమ తి లేకపోవడం, అగ్రిమెంట్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతోనే ఇలా జరిగినట్లు తెలిసింది. తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ స్థలంలో కుడా భారీ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించింది. 50వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉండేలా 5 అంతస్తులతో స్లాబుల వరకు పూర్తి చేసింది. ఈ భవనాన్ని లీజుకు ఇవ్వడం ద్వారా ఆదాయం వస్తుందని భావించింది. ఇలా వచ్చే ఆదాయంలో స్పోర్ట్ అథారిటీకి కొంత మొత్తం ఇచ్చి మిగిలిన నిధులను కుడాకు చెందేలా ఈ భవన నిర్మాణం చేపట్టింది. కమర్షియల్ అవసరాలకు అనుగుణంగా పాక్షికంగా నిర్మాణం పూర్తి చేసి లీజుకు ఇచ్చేందుకు కుడా ఆరు నెలల క్రితం టెండర్లు పిలిచింది. చదరపు అడుగుకు నెలకు రూ.15 చొప్పున ఇచ్చేలా ఏకైక టెండర్ దాఖలైంది. కుడా పాలకమండలి ఈ మేరకు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది.
రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అనంతరం కుడాకు, లీజుదారుడికి మధ్య అగ్రిమెంట్ జరగాల్సి ఉంటుంది. ప్రతినెల లీజు మొత్తం రూ.9లక్షలు ఇవ్వడంతోపాటు మిగిలిన నిబంధనలు దీంట్లో ఉంటాయి. కుడా లీజు ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభు త్వ అనుమతి రాకముందే.. ప్రతిపాదనలో ఉన్న వ్యక్తి ఈ భవనంలో పను లు చేపట్టాడు. భవనంలోని 5 అంతస్తుల్లో అప్పటికే ఉన్న స్లాబులకు అనుగుణంగా గోడల నిర్మాణం పూర్తి చేశా డు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి వచ్చి అగ్రిమెంట్ చేసుకున్న తర్వాతే భవనంలో పనులు చేపట్టాలని పేర్కొంటూ లీజు ప్రతిపాదనలో ఉన్న వ్యక్తికి కుడా మూడు నెలల క్రితం మొదటి నోటీసు పంపింది. అయినా పనులు కొనసాగించడంతో రెండోసారి నోటీసు పంపింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి, అగ్రిమెంట్ లేకుండా పనులు చేయడంతోపాటు భవనం లీజు తనకు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ లీజు ప్రతిపాదనలో ఉన్న వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిసింది. మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి, కుడా వైస్ చైర్‌పర్సన్‌ను ఈ పిటిషన్లో చేర్చినట్లు తెలిసింది. అగ్రిమెంట్‌కు ముందే పనులు చేపట్టడంపై చివరి చర్యగా కుడా భవనంపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. భవనం కుడా పరిధిలోనే ఉన్నదని, ఆవరణలోకి వచ్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నది.
మొదటి నుంచీ లీజు చర్చే..
ఈ భవనం లీజు అంశంపై మొదటి నుంచి చర్చ జరుగుతున్నది. నగరంలో బాగా డిమాండ్ ఉన్న ప్రాంతంలో తక్కువ ధరకు లీజు ప్రతిపాదనలు ఉండడంపై మిశ్రమ స్పందన వచ్చింది. టెండర్ ప్రక్రియలో ఒక్కరే పాల్గొనడం, చదరపు అడుగుకు ‘కుడా’ రూ.15తో వేలం మొదలుపెట్టింది. ఇదే ధరకు తుది ప్రతిపాదన సిద్ధమైంది. నగరంలో ని ముఖ్య సర్కిళ్లలో చదరపు అడుగుకు రూ.50కంటే ఎక్కువగా ఉన్నది. ఈ కారణంతోనే ప్రభుత్వం కూడా ఆమోదంపై ఆలస్యం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణ యం రాకుండానే భవనంలో పనులు చేయడం, నోటీసులు ఇచ్చినా ఆపకపోవడంతో స్వాధీనం చేసుకుంటూ కుడా నిర్ణయం తీసుకున్నది.