హనుమకొండ చౌరస్తా, మార్చి 30: కాకతీయ విశ్వవిద్యాలయం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.331.99 కోట్లతో అంచనా బడ్జెట్ ను ప్రతిపాదించింది. సోమవారం సెనెట్హాల్లో వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన 41వ అకాడమిక్ సెనెట్ సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి వీ రామచంద్రం, అకాడమిక్ సెనెట్ సభ్యుల సమక్షం లో అర్థశాస్త్ర విభాగ ఆచార్యులు, సోషల్ సైన్సెస్, ఆర్ట్స్ విభాగాల డీన్, దూరవిద్యాకేంద్ర సంచాలకుడు, పాలకమండలి స భ్యుడు ఆచార్య బీ సురేశ్‌లాల్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఏడాదిపాటు ఉద్యోగుల వేతనాలు, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లు, ఉద్యోగ విరమణ భత్యాలు, నిర్వహణ ఖర్చులు, పరీక్షలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర ఖర్చులకు రూ.355.90 కో ట్లు కేటాయించారు.
మొత్తం బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం నుం చి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రూ. 205.47 కోట్లు కాగా, ఇతర వనరుల నుంచి రూ.126.52 కోట్లు రాబడి వస్తుందని అంచనా వేశారు. వీటిలో ఉన్నత విద్యామండలి నుంచి సెమినార్ల కోసం రూ.10లక్షలు, ఇతరాల నుంచి రూ.15.50 లక్షలు, అకాడమిక్, ట్యూషన్ ఫీజుల రూపంలో రూ.8.33 కోట్లు, అంతర్గత వనురుల ద్వారా రూ.41.41 కోట్లు, ఇతర పద్దుల ద్వారా 21.56కోట్లు, పరీక్షల విభాగం నుంచి రూ. 49.64కోట్లు ముఖ్యంగా ఉన్నాయి. ఖర్చులు, రాబడులను సురేశ్‌లాల్ 8 అంశాల్లో చూపించారు. అదే సమయంలో రూ.2.16కోట్లు లోటు ఉంటుందని వెల్లడించారు.
ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు రూ.169.96కోట్లు, నిర్వహణకు రూ. 10.34 కోట్లు, పరీక్షలకు రూ.54.88 కోట్లు, అకాడమిక్‌కు రూ.13.68 కోట్లు, అభివృద్ధి కార్యక్రమాలకు రూ.97.44 కోట్లు, అప్పులు ఇతరాలకు రూ.1.75 కోట్లు, కరువు భత్యానికి రూ.8.40 కోట్లు వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ అభివృద్ధిలో అందరి కృషి ఉన్నదని, బాధ్యతతో ముం దుకు తీసుకెళ్తున్నామని వీసీ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. 2026లో విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవ ఏడాదిలోకి అడుగు పెట్టిందని, ఆ సందర్భంగా అకాడమిక్ కార్యక్రమాలు (గోల్డెన్ జూబ్లీలో భాగంగా) జరుగుతున్నాయని చెప్పారు. నూతన కోర్స్‌లు జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా తీసుకొస్తామని, విద్యార్థులను ఉద్యోగార్థులుగా చేయడమే లక్ష్యంగా, సిలబస్ రూపకల్పన, కృత్రిమమేథా, క్వాంటం టెక్నాలజీ పొందుపరుస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థులు మానసిక స్థితికి తోడుగా ‘చేతనా’ సెంటర్‌ను నెలకొల్పామని, లైబ్రరీకి నిధులు పెంచుతున్నట్లు చెప్పారు. అనంతరం స్టాండింగ్ కమిటీ ఆఫ్ అకాడమిక్ సెనెట్‌ను, వార్షిక నివేదికలను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సమావేశంలో పాలక మండలి సభ్యు, ప్రొఫెసర్లు కట్ల రాజేందర్, ఎన్ ప్రసాద్, ఎం సదానందం, ప్రిన్సిపాల్స్ టీ మనోహర్, జీ కృష్ణవేణి, ఎన్ రమణ, కే భిక్షాలు, ఎస్ జ్యోతి, భాసర్, నల్లాని శ్రీనివాస్, గోపి, బీఎస్ఎల్ సౌజన్య, అకాడమిక్ సెనెట్ సభ్యులు జగదీశ్, మాణిక్యం, ఫైనాన్స్ ఆఫీసర్ హబీబుద్దీన్, రాము, సీహెచ్ ప్రణయ్‌కుమార్, ఆర్ శ్రీలతదేవి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.