హనుమకొండ చౌరస్తా, మార్చి 23 : విద్యకు నిలయంగా, విజ్ఞాన గనిగా పేరున్న కాకతీయ విశ్వవిద్యాలయం ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా మారుతోంది. గత కొంతకాలంగా కేయూ హాస్టళ్లలో జరుగుతున్న వరుస ఘర్షణలు క్యాంపస్‌లో అలజడిని సృష్టిస్తున్నాయి. చిన్నచిన్న కారణాలకే మొదలవుతున్న వివాదాలు చిలికి చిలికి గాలివానలా మారుతున్నాయి.
హాస్టళ్లలో శాంతిభద్రతలు క్షీణిస్తుండడంతో సామాన్య విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల తోటి విద్యార్థినిని కొట్టడంతో ఆమె ఆత్మహత్య చేసుకోవడం, చికెన్ కోసం విద్యార్థులు గొడవపడి కర్రలు, రాడ్లతో తలలు పగులగొట్టుకోవడం, ర్యాగింగ్ తదితర ఘటనలు తారాస్థాయికి చేరాయి. ఇంత జరుగుతున్నా యూనివర్సిటీ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం, పోలీసుల పట్టింపులేని తనంతో కాకతీయ యూనివర్సిటీ (కేయూ)లోని హాస్టళ్లు గాడి తప్పుతున్నాయి. విద్యా కుసుమాలను వికసింపజేయాల్సిన క్యాంపస్ ప్రస్తుతం గొడవలకు కేరాఫ్‌గా మారుతున్నది. ఇటీవల చికెన్ కోసం హాస్టల్లో, క్రికెట్లో తలెత్తిన చిన్న గొడవతో గ్రౌండ్లో విద్యార్థులు కొట్టుకున్నారు. కామన్ మెస్‌లో కూడా సీనియర్లు-జూనియర్లు కొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా హాస్టళ్లలో ఉండే కొందరు విద్యార్థులు తరుచూ గొడవలకు దిగుతున్నట్లు తెలుస్తున్నది.
హాస్టల్‌కు, మెస్‌లో తినడానికి బయటి వ్యక్తులు, విద్యార్థి సంఘాల నాయకులు రావడంతో ఘర్షణలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. రాత్రి 11 గంటల వరకు విద్యార్థులు రోడ్లపై తిరగడం, డివైడర్లపై కూర్చోవడం, పుట్టినరోజు వేడుకలు, మందు పార్టీలు కామన్ అయిపోయాయి. నిత్యం ఏదో ఒక చోట గొడవలకు దిగడం సాధారణంగా మారింది. ఎంబీఏ, ఎకనామిక్స్ విద్యార్థుల మధ్య విభేదాలుండగా పలు విభాగాల విద్యార్థుల మధ్య ఇప్పటికే నాలుగు సార్లు ఘర్షణలు జరిగాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఉన్నత విద్యనభ్యసించడానికి వచ్చిన ఇతర విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హాస్టళ్లలో ఇంత జరుగుతున్నా డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు చోద్యం చూస్తున్నారు. హాస్టళ్ల నిర్వహణ సక్రమంగా చేపట్టేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు నూతనంగా డైరెక్టర్లను నియమించినా, వారు పర్యవేక్షించకపోవడంతో తరచుగా విద్యార్థుల మధ్య ఘర్షణలు తలెత్తున్నాయనే ఆ రోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఘర్షణను పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతోనే పెద్దగా మారిందని పలువురు వి ద్యార్థులు తెలిపారు. గొడవలకు కారణమైన వారి ని గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటే ఇలాంటి వి పునారావృతం కావంటున్నారు.
కాగా, దాడులకు కారణమైన వారితో కేయూ వీసీ, రిజిస్ట్రార్, పోలీసులు రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీసీ, రిజిస్ట్రార్ కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని విద్యార్థులు, మేధావులు మండిపడుతున్నారు. యూనివర్సిటీలో అవినీతికి పాల్పడుతున్న అధికారులు, ఘర్షణకు దిగుతున్న వారిపై పేరుకే విచారణ కమిటీలు వేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చికెన్ లొల్లికి కారణమైన 40 మంది విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాచారం. యూనివర్సిటీ చర్రితలో ర్యాగింగ్‌కు పాల్పడిన సుమారు 81 మందిపై చర్యలు తీసుకున్న అధికారులు, కొట్టుకున్న, విద్యార్థిని మృతికి కారణమైన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పద్మాక్షి హాస్టల్లో విద్యార్థినుల మధ్య జరిగిన చిన్న గొడవ కారణంగా విద్యార్థిని శ్రీవిద్య ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. విచారణ కోసం కమిటీని నియమించాం. సోమవారం కమిటీ రిపోర్టు మాకు సమర్పించింది. తప్పు ఎవరు చేసినా కమిటీ రిపోర్టు ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
– వల్లూరి రాంచంద్రం, ప్రొఫెసర్, కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్