గణపురం, ఆగస్టు 28 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీపీ)లో రూ. 3 కోట్లకు పైగా విలువచేసే ఇనుప తుకు కుంభకోణం పక్కదారి పట్టిందా? చర్యలు లేకుండానే కేసును మూసేశారా? డబ్బుల రికవరీ జరగలేదా? దీని వెనుక పెద్దల హస్తం ఉన్నదా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
ఏడాదిగా ఈ కేసు విషయమై చడీ చప్పుడు లేకపోవడంతో జెనో ఉన్నత స్థాయి అధికారే పకడ్బందీగా పక్కదారి పట్టించినట్లు తెలుస్తున్నది. కిందిస్థాయి అధికారులను ప్రశ్నించి వారిపై తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి కేసును మూసేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే కేటీపీపీలో ఏదైనా యంత్రం మరమ్మతుకు గురైతే కొత్తది అమర్చడానికి అవసరమైన పరికరాలను నాలుగు స్టోర్ రూముల్లో భద్రపరుస్తారు.
బాయిలర్, టర్బైన్, జనరేటర్, చిమ్నీ, కూలింగ్ టవర్‌కు సంబంధించిన అదనపు విడిభాగాలను ఇందులో నిల్వ ఉంచుతారు. వీటిని ఒక డీఈతో పాటు ఇద్దరు ఏఈలు, జేపీఏలు, ఆర్టిజన్లు పర్యవేక్షిస్తారు. ఈ క్రమంలో 2010 నుంచి పాడైపోయిన విడిభాగాలు తుక్కు (స్క్రాప్) కింద విపరీతంగా స్టోర్ రూముల్లో పేరుకుపోయాయి. వీటిని అప్పట్లో అధికారులు టెండర్ల ద్వారా విక్రయించేవారు.
ఈ తుకును టెండర్ దక్కించుకున్న ఓ ప్రైవేట్ దేశీయ కంపెనీ కొనుగోలు చేస్తున్నది. ఈ క్రమంలో ఆ కంపెనీకి చెందిన ప్రతినిధులతో స్టోర్ రూంలోని కొందరు ఉద్యోగులు కుమ్మకై తుకుతో పాటు రూ. 3 కోట్లకు పైగా విలువైన కొత్త విడిభాగాలను సైతం తీసుకెళ్లినట్లు ఆరోపణలున్నాయి. తుకు వాహనమే కదా అని సెక్యూరిటీ అధికారులు కూడా తనిఖీ చేయకుండానే బయటకు పంపించారు.
ఈ విషయం అప్పటి సీఎండీ ప్రభాకర్‌రావు దృష్టికి వెళ్లడంతో జెన్కో చీఫ్ విజిలెన్స్ అధికారి ముత్యంరెడ్డిని విచారణ కోసం పంపించారు. ఇప్పటి వరకు బాగానే ఉన్నా.. తొమ్మిది నెలలుగా విచారణ నివేదికను అధికారులు గోప్యంగా ఉంచడంపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. తుక్కు కింద కొత్త పరికరాలను తరలించిన ఉదంతంలో కేటీపీపీ ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు.. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారమే పని కానిచ్చినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. జెన్కోలో పనిచేస్తున్న ఓ ఉన్నత స్థాయి అధికారే స్వయంగా ఈ కేసును డీల్ చేసి పక్కదారి పట్టించినట్లు తెలుస్తున్నది. కొందరు ఏడీఈలు, ఎస్ఈలు హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలున్నాయి.
అందువల్లే ముందుగా హడావిడి చేసిన విచారణ అధికారులు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు కిందిస్థాయి సిబ్బందిపై కేసులు నమోదుచేసి కేసును మూసివేసినట్లు కేటీపీపీలో చర్చించుకుంటున్నారు. ఈ కుంభకోణం విలువ రూ. 3 కోట్లు కాదని, అంతకన్నా ఎక్కువగానే ఉంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తుక్కు పేరిట కొత్త పరికరాలు అమ్ముకొని సొమ్ముచేసుకున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.