భీమదేవరపల్లి, జనవరి 14: కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కడిపికొండ, దామెరకు చెందిన కుమ్మరి వంశస్తులు ఆనవాయితీ ప్రకారం భోగి పండుగ రోజు కుమ్మరి (వీర)బోనం చేశారు. ఈ సందర్భంగా ఎడ్లబండ్లను రథాలుగా తీర్చిదిద్దారు. శివసత్తుల నృత్యాలు, వీరశైవుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బోనంతో వెళ్లిన కుమ్మరి వంశస్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించారు.
స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తమ గండాలు తొలగిపోవాలని గండ దీపం వద్ద నూనె పోశారు. కోరిన కోర్కెలు తీర్చాలని స్వామి వారికి కోరమీసాలు సమర్పించారు. కోడె మొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, బీజేపీ నాయకులు బొమ్మ శ్రీరాంచక్రవర్తి, రావు పద్మ, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
మకర సంక్రాంతి పర్వదినాన సూర్యుడు ధనస్సురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజున స్వామివారిని దర్శించుకుంటే ఐష్టెశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సోమవారం ఎడ్లబండ్ల రథాలు ఆలయ ప్రదక్షిణలు చేస్తాయి.