దేవరుప్పుల, జూలై 4 : కేవలం వనరులను కొల్లగొట్టేందుకే ఆపరేషన్ కగార్ పేరుతో మావోస్టులను నిర్మూలిస్తామని కేంద్రం అంటున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు కడవెండికి చెందిన దొడ్డి కొమురయ్య 79వ వర్ధంతిని శుక్రవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో వర్ధంతి సభకు నారాయణ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం హిట్లర్, నిజాం కన్నా బలంగా ఉందా?, నక్సలైట్లను నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటున్నాడు.. అది వాళ్ల తరంకాదన్నారు. దేశంలో బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలను కూలగొడుతున్నారు, నిధులు నిలిపేస్తున్నారు.. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చుతానంటున్నది.. ప్రజాస్వామ్యానికి విఘాతం కలగకముందే ఎర్రజెండా పట్టే పార్టీలన్నీ ఒకే గొడుగు కిందికి రావాలని ఆయన పిలుపునిచ్చారు.