నల్లబెల్లి, జూలై7: ఎస్సై శ్రీనివాస్ మృతికి బాధ్యులను అరెస్ట్ చేయాల్సిందేనని మండలంలోని నారక్కపేట జాతీయ రహదారిపై కుటుంబసభ్యులు, మాజీ ఎమ్మెల్యే పెద్ది, బీఆర్ఎస్, దళిత సంఘాల నాయకులు బైఠాయించారు. దీంతో మూడు గంటలపాటు ఉద్రిక్తత నెలకొన గా, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ హామీతో ఆందోళన విరమించారు. వివరాలిలా ఉన్నాయి.. నారక్కపేట గ్రామానికి చెందిన శ్రీరాముల శ్రీనివాస్(38) 2014లో ఎస్సై ఉద్యోగం పొంది ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పనిచేస్తున్నాడు. అయితే సీఐ జితేందర్‌రెడ్డి, సిబ్బంది వేధిస్తున్నారని మనస్తాపంతో జూన్ 30న పురుగుల మందు తాగగా, హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ క్రమంలో మృతదేహాన్ని నారక్కపేటకు తీసుకురాగా, జాతీయ రహదారిపై కుటుంబసభ్యులు బైఠాయించారు. ఉన్నతాధికారులు స్పందించి శ్రీనివాస్ మృతికి బాధ్యులైన పోలీస్ సిబ్బందితోపాటు సీఐని తక్షణమే అరెస్ట్ చేయాలని, తమకు న్యాయం చేయాలని మూడు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. బాధితులకు అండగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితోపాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, దళిత సంఘాల నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. డీసీపీ రవీందర్, నర్సంపేట ఏసీపీ కిరణ్‌కుమార్ నచ్చజెప్పినా తమకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వర కు కదిలేది లేదని బాధితులు భీష్మించుకుని కూ ర్చున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజ్ నారక్కపేటకు చేరుకుని పెద్దితోపాటు మృతుడి భార్య, కుటుంబసభ్యులతో చర్చలు జరిపారు. ఎస్సై భార్యకు ప్రభుత్వ ఉద్యోగంతోపాటు ఎక్స్‌గ్రేషియా అందించేలా చర్యలు చేపడుతామని, శ్రీనివాస్ మృతికి కారకులైన వారిని తక్షణమే అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో మృతుడి బంధువులు రాస్తారో కో విరమించి అంత్యక్రియలు నిర్వహించారు.
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. చట్టాన్ని సంరక్షించే పోలీసుకే రక్షణ లేకుంటే సామాన్యుడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దళితుడై ఉండి దళిత పోలీస్ అధికారి గురించి పట్టించుకోలేదంటే ఆయనకు వారిపై ఉన్న చిత్తశుద్ధి తేటతెల్లమైంది. ఇకనైనా రేవంత్‌రెడ్డి సర్కా రు స్పందించి ఎస్సై శ్రీనివాస్ మృతికి కారకులైన వారిని అరెస్ట్ చేసి ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలి. మృతుడి భార్యకు ప్రభు త్వ ఉద్యోగం కల్పిస్తూ రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి.
నర్సంపేట రూరల్, జూలై 7: ఎస్సై శ్రీనివాస్ మరణ వార్త విన్న అతడి మేనత్త దార రాజమ్మ (65) గుండెపోటుతో ఆదివారం మృతి చెందిం ది. దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామానికి చెందిన రాజమ్మ తన మేనల్లుడు మృతి చెందాడని తెలియడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే కుటుంబసభ్యులు వరంగల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచింది. ఆమెకు భర్త ఐలయ్య, ఇద్దరు కుమారులున్నారు. ఒకే రోజు ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకున్నది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆమె కుటుంబాన్ని పరామర్శించి, మృతదేహం వద్ద నివాళులర్పించారు.