హనుమకొండ చౌరస్తా, జనవరి 25 : ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మేడారం జాతరకు దేశ నలుమూలల నుంచి లక్షలాది గా తరలివచ్చే భక్తుల కవరేజ్ కోసం వెళ్లే జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన పాసులు బస్సుల్లో చెల్లడం లేదు. వివరాలిలా ఉన్నాయి.. నర్సంపేట డిపోకు చెందిన టీఎస్ 08జెడ్0110 గల బస్సులో ఓ జర్నలిస్ట్ పస్రా నుంచి మేడారం కవరేజ్‌కు వెళ్తూ పాస్ చూపించగా కండక్టర్ శ్రీకాంత్ తిరసరించాడు.
బస్సు పాస్ చెల్లదని, మేడారం జాతర సందర్భంగా రూల్స్ మారాయని అధికారులు చెప్పారని, రూ. వంద తీసుకొని టికెట్ ఇచ్చాడు. ఈ విషయమై సదరు జర్నలి స్టు వరంగల్ ఆర్ఎంకు ఫోన్ చేయగా సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో మేడారం జాతరకు జర్నలిస్టుల పాసులు చెల్లడంలేదనే సమాచారం చక్కర్లు కొట్టింది. దీనిపై వరంగల్ ఆర్ఎం విజయభానును వివరణ కోరగా ‘నాక్కూడా తెలియదు. ఎక్కడో పొరపాటు జరిగింది. మేం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. జర్నలిస్టు పాసులను అనుమతించాలని అన్ని డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేస్తాం’ అని చెప్పారు.