అడవుల జిల్లా ములుగులోని మారుమూల ప్రాంతాలకు ‘108 వాహనం’ ఆపద్బంధువులా మారింది. ఏజెన్సీలో అత్యాధునిక వైద్యం ఇంటి ముంగిటకు వచ్చి మంత్రసాని వ్యవస్థ కనుమరుగైంది. కొన్నిసందర్భాల్లో అంబులెన్స్‌లోనే ప్రసవాలు జరిగి తల్లీబిడ్డా క్షేమంగా ఇళ్లకు చేరుతున్నారు. తెలంగాణ సర్కారు 108 వాహన సేవలను విస్తృతం చేయగా ఒక్క ఫోన్ కాల్‌తో రయ్‌మంటూ దూసుకొస్తూ అపర సంజీవని వాహనాలు ఇంటి ముందు వాలిపోతున్నాయి. ఏటూరునాగారం సామాజిక వైద్యశాల పరిధి గ్రామాల నుంచి ఇప్పటి వరకు 515 మంది గర్భిణులను దవాఖానలకు తరలించాయి. 36మందికి కాన్పు చేసి తల్లీ బిడ్డలను ఇళ్లకు క్షేమంగా చేర్చాయి. ఆపదలో ఉన్నవారికి అంబులెన్స్‌లో ఉండే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, పైలెట్లు చాకచక్యంతో వ్యవహరిస్తూ ప్రాణహాని లేకుండా చూస్తుండడంతో మాతా శిశుమరణాలు చాలామట్టుకు తగ్గుముఖం పట్టాయి.
ఏటూరునాగారం, డిసెంబర్ 10 : ఏజెన్సీ వాసులకు 108 అంబులెన్స్‌లు కల్పతరువుగా మారాయి. ఒకప్పుడు రవాణా సౌకర్యం సరిగాలేక వాహనాలు గూడేలకు రాకపోయేది. దీంతో దవాఖానలకు వెళ్లేందుకు గిరిజనులు తీవ్ర అవస్థలుపడేది. అత్యంత మా రుమూల పల్లెలు, గొత్తికోయగూడేలకు చెందిన వారు బాధితులను మంచంపై రోడ్లపైకి మోసుకొచ్చి వాహనాల్లో ఎక్కించి వైద్యశాలలకు తీసుకెళ్లేవారు. దానికి చరమగీతం పాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రవాణా సౌకర్యాలు మెరుగుపరిచి ప్రతి గూడేనికి 108 అంబులెన్స్ వెళ్లేలా చర్యలు తీసుకుంది. ఒక్క ఫోన్ చేస్తే చాలు రయ్యుమంటూ వాహనం ఇంటి ముందు వాలుతున్న ది. దీంతో పురుడు పోసే మంత్రిసాని వ్యవస్థ కనుమరుగైంది. అంబులెన్స్‌లోనే కాన్పులు అవుతున్నాయి. ఒకప్పుడు గ్రామాల్లో కాన్పు కావాలంటే నొప్పులు రా గానే మంత్రిసానిని సంప్రదించేవారు. ఏరాత్రి అయినా ఇంటికి వచ్చి పురుడు పోసేవారు. ఆ తర్వాత బాలింతలు పైత్యం, వాతం బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన వాత విధ్వంసి, పైత్యాంతకం, యమగర్భం, కనక చందురం, తిమ్మాత్ర లాంటి ఆయుర్వేద మాత్రలను సానపై రంగరంచి తాగించే వారు. క్రమం గా ఆధునిక వైద్యం అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం వాటి ఊసే లేకుండా పోయింది. అందుబాటులోకి 108 వాహనాలు వచ్చాయి. నెల వారీ పరీక్షల కోసం గర్భిణులను 102 వాహనాల్లో తీసుకవస్తున్నారు. వారి ఆరోగ్యంపై అంగన్వాడీ కేంద్రాలు, ఆశ వర్కర్లు ఎప్పటికప్పుడు వాకబు చేసి సరైన సమయంలో ప్రసవమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి అత్యవసర వైద్యం అందుబాటులోకి రావడంతో ఇంటిల్లిపాది నిశ్చితంగా ఉంటున్నారు.
ఆరు నెలల్లో 36 కాన్పులు
మారుమూల అటవీ ప్రాంత ప్రజలకు అంబులెన్స్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో కొంత కాలంగా ప్రసవ మరణాలు పూర్తిగా తగ్గాయి. వైద్యశాలలోనే కాన్పులు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. స్త్రీల వైద్య నిపుణులు అందుబాటులో ఉంటున్నారు. వీరికి తోడు ఏటూరునాగారంలోని సామాజిక వైద్యశాల పరిధిలోని మండలాల్లో ప్రతి మండలానికి ఒకటి చొప్పున 108 అంబులెన్స్‌ను ప్రభుత్వం అందజేసింది. గత ఆరునెలల నివేదికను పరిశీలిస్తే ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాల నుంచి 108 అంబులెన్స్‌ల ద్వారా 515 మందిని కాన్పుల కోసం వైద్యశాలకు తరలించారు. ఇందులో 36 ప్రసవాలు అంబులెన్స్‌లోనే జరిగాయి. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, పైలెట్లు చాకచక్యంగా వ్యవహరిస్తూ సురక్షిత ప్రసవాలు చేసి ప్రాణాలు పోస్తున్నారు. ఏటూరునాగారం మండలంలో ఆరు నెలల్లో 155 మందికి అంబులెన్స్ సౌకర్యం కల్పించగా ఇందులో మార్గ మధ్యంలో ఎనిమిది మంది ప్రసవించారు. మంగపేట మండలంలో 78 మందికి గాను ఎనిమిది మంది, వాజేడు నుంచి 65 మందికి గాను ఆరుగురు, కన్నాయిగూడెం మండలంలో 94 మందికి గాను ఎనిమిది, వెంకటాపురం మండలం నుంచి 133 కేసులను తీసుకురాగా ఇందులో 8 మంది అంబులెన్స్‌లోనే ప్రసవించారు.
మండలానికి ఒక అంబులెన్స్
మండలానికి ఒక 108 అంబులెన్స్‌ను సమకూర్చగా ఏటూరునాగారం మండలానికి రెండు ఉన్నాయి. ప్రతి వాహనంలో ఇద్దరు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్, ఇద్దరు పైలెట్లు ఉంటారు. జిల్లాలోని తొమ్మిది మండలాల్లో 36 మంది సిబ్బంది ఉండగా మరో ఆరుగురు రిలీవర్లు ఉన్నారు. దీంతో 42 మంది సిబ్బంది 108 అంబులెన్స్‌లో పనిచేస్తున్నారు. ప్రసవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రసవం జరిగిన తర్వాత వారి కండిషన్‌ను పరిశీలించి వెంటనే సామాజిక వైద్యశాలకు తరలిస్తున్నారు.