భూపాలపల్లి రూరల్, జనవరి 6: రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేయాలని జయశంకర్ జిల్లా కలెక్టర్ భవే శ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై ముందస్తుగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందు వల్ల ప్రభుత్వం ఏ సమయంలోనైనా రిపబ్లిక్ డే నిర్వహణపై నిబంధనల మేరకు అనుమతి మంజూరు చేయవచ్చని, అందుకు ముందస్తు ప్రణాళికలో భాగంగా ఏర్పాట్లు చేసేందుకు అధికారులు సన్నద్ధం కావాలని సూచించారు. కొవిడ్ నిబంధనలపై ఆంక్షలు విధిస్తే ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేయాలన్నారు. అధికారులు, సిబ్బందికి విధులు కేటాయించామని, ఏర్పాట్లకు కావాల్సిన నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.
డీపీఆర్వో కార్యాలయం ద్వారా గౌరవ ముఖ్య అతిథుల సందేశాన్ని తయారు చేస్తున్నట్లు చెప్పారు. పోలీస్ శాఖ ద్వారా గౌరవ వందన స్వీకరణ, శాఖల వారీగా ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించడం, శాఖల వారీగా అభివృద్ధి కార్యక్రమాలపై శకటాలను తయారు చేయడం, విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు. మున్సిపల్ ఆధ్వర్యంలో శానిటేషన్, తాగునీటి సౌకర్యాలను కల్పించడానికి చర్యలు చేపట్టాలని అన్నారు. సమావేశంలో కలెక్టరేట్ ఏవో మహేశ్‌బాబు, ముఖ్య ప్రణాళిక అధికారి సామ్యూల్, బీసీ సంక్షేమ శాఖ అధికారి శైలజ, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి సునీత, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.