జయశంకర్ భూపాలపల్లి : ధాన్యం బోనస్ డబ్బులు చెల్లించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లో రైతులు ఆందోళన చేపట్టారు. సోమవారం ప్రజావాణికి హాజరైన సుమారు 70 మంది రైతులు కలెక్టర్ రాహుల్ శర్మతో పాటు అధికారులతో బోనస్ పైసల జాప్యంపై వాగ్వివాదానికి దిగారు. కలెక్టర్ ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి బయటకు పంపే ప్రయత్నం చేసినప్పటికి రైతులు ఆందోళన విరమించలేదు.
జిల్లాలోని కాటారం, మల్హర్ మండలాలకు చెందిన సుమారు 2000 మందికి బోనస్ పడలేదని, ఫిబ్రవరి మొదటివారం నుండి బోనస్ కోసం తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు మండిపడ్డారు. వచ్చిన ప్రతిసారి ఏపీజీవీబీ బ్యాంకు సమస్య ఉందని త్వరలోనే పరిష్కరించి బోనస్ అందిస్తామని చెబుతూ దాటవేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావాణి అనంతరం మాట్లాడతానని ఈరోజు సమస్య పరిష్కరిస్తానని కలెక్టర్ చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.