జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 12(నమస్తేతెలంగాణ)/ములుగు టౌన్/జనగామ చౌరస్తా : ఎన్నికల ప్రక్రియలో ప్రధాన భూమికను పోషించే ఈవీఎంల భద్రత కోసమే గోడౌన్లను నిర్మించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌గోయల్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ జిల్లా కేంద్రాల్లో నిర్మించిన ఈవీఎం, వీవీ ప్యాట్లను భద్రపరిచే గోడౌన్లను ఆయన జిల్లా కలెక్టర్లు భవేష్‌మిశ్రా, కృష్ణ ఆదిత్య, శివలింగయ్యతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీవీ ప్యాట్‌ను పోలిన కేక్‌ను కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలు ఎన్నికలకు గుండె కాయలాంటివని, అన్ని జిల్లాల్లో ఈవీఎంలను భద్రపరిచేందుకు ప్రత్యేక గోడౌన్లు ఉండాలనే ఉద్దేశంతో నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 ఈవీఎంల గోడౌన్ల నిర్మాణాలు చేపట్టగా, 20 పూర్తయ్యాయని, నారాయణపేట, కామారెడ్డి జిల్లాల్లో ఈనెలాఖరు వరకు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. పోలీస్ బందోబస్తుతో ఈవీఎంలను గోడౌన్లలో భద్రపరిచి భవిష్యత్‌లో జరుగనున్న ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఉపయోగిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా ములుగు కలెక్టరేట్ ఆడిటోరియంలో తహసీల్దార్లు, బీఎల్వోలతో సమావేశం నిర్వహించి ఎన్నికల నియమావళి, ప్రత్యేక సమ్మరీ రివిజన్, గరుడ యాప్, ఓటర్ హెల్ప్‌లైన్, ఆన్లైన్లో డెత్ ఓటర్ జాబితాను తొలగించడం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో బీఎల్‌వోలందరూ గరుడ యాప్‌పై అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల నియమావళికి సంబంధించిన అన్ని ఫారాలను ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. ఎన్నికల సమయంలో ప్రతి ఓటరు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా శశాంక్ గోయల్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో ములుగు ఆర్డీవో రమాదేవి, ఏఎస్పీ సుధీర్ రంగనాథ్ కేకన్, భూపాలపల్లి ఆర్డీవో శ్రీనివాస్, జనగామ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఏ భాస్కర్‌రావు, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీవోలు మధుమోహన్, కృష్ణవేణి పాల్గొన్నారు.