మహదేవపూర్, (కాటారం) జనవరి 6 : అన్నదాతలను ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం దేశం మెచ్చేలా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని టీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. గురువారం కాటారం మండలకేంద్రంలో రైతుబంధు సంబురాలు నిర్వహించారు. ప్రధాన రహదారిపై సుమారు వంద ఎడ్ల బండ్లతో భారీ ర్యాలీ తీశారు. అనంతరం అంబేద్కర్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పుట్ట మధు మాట్లాడారు. రైతులకు పంట పెట్టుబడి అందిస్తున్న సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. అంతేకాకుండా రైతు బీమాతో ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు చెప్పారు. కాటారం, మహదేవపూర్, మల్హర్, పలిమెల, మహాముత్తారం మండలాల్లో మొత్తం 38 వేల మంది రైతులు లబ్ధిపొందుతున్నట్లు తెలిపారు. ఐదు మండలాల్లో 80 శాతం ప్రజలు పెట్టుబడి సాయం అందుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రజల అవసరాల మేరకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు.
విజేతలకు బహుమతుల ప్రదానం
రైతుబంధు పథకం, కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాటారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. విజేతలకు గురువారం పుట్ట మధు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందని, ఏదో ఒక రూపంలో పాఠశాలలకు అన్ని సౌకర్యాలు కల్పించేలా చొరువ తీసుకోవాలన్నారు. అనంతరం మండలకేంద్రంలో వేసిన ముగ్గులను పరిశీలించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ జయశంకర్ భూపాలపల్లి యువ నాయకుడు జక్కు రాకేశ్, కాటారం పీఏసీఎస్ చైర్మన్ చల్ల నారాయణరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు తోట జనార్దన్, యూత్ మండల అధ్యక్షుడు రామిల్ల కిరణ్, మండల మహిళా అధ్యక్షురాలు సుజాత, నాయకులు మంథెన చిరంజీవి, దబ్బెట రాజేశ్, జక్కు రాకేశ్, తదితరులు పాల్గొన్నారు.
రైతులకు అండగా టీఆర్ఎస్ : ఎమ్మెల్యే గండ్ర
మొగుళ్లపల్లి, జనవరి 6 : టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం మండలకేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి కింద రూ.50 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. అంతకుముందు ఆయన పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జోరుక సదయ్య, ఎంపీపీ యార సుజాతా సంజీవరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు, సర్పంచులు అన్నారెడ్డి, ధర్మారావు, సునీల్‌రెడ్డి, అరవింద్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, మాధవీ శ్యాంసుందర్‌రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.