ఉనికి కోసమే వారి యాత్రలు
బీజేపీ, కాంగ్రెస్ నేతలు పిచ్చిప్రేలాపనలు మానుకోవాలి
బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర అర్థరహితం
బ్రిటీష్ పాలనను తలపిస్తున్న బీజేపీ పాలన
మీడియా దృష్టిని ఆకర్షించేందుకే రేవంత్‌రెడ్డి ఆరాటం
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ధ్వజం
జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 29( నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు పసలేని రాజకీయాలు చేస్తున్నాయి.. రాష్ట్రంలో ఏదో జరుగరానిది జరిగిపోతున్నదనే భ్రమలో నాయకులు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారంటూ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతల తీరుపై ఫైర్ అయ్యారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర అర్థరహితమని.. ఢిల్లీలో మోదీపై చేయాలని హితవు పలికారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు.. తన నిర్ణయాలతో దేశంలో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నదని మండిపడ్డారు. ఇక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు తెగ ఆరాటపడుతున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ప్రతి పక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పసలేని రాజకీయాలు చేస్తున్నాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఎందుకోసం చేస్తున్నారో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ఆ యాత్రను ఢిల్లీలో చేయడం మేలని హితవుపలికారు. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ తీసుకునే నిర్ణయాలతో రైతుల నడ్డివిరిగిందన్నారు. రైతు, ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి వారికి అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని నిరసిస్తున్న ప్రజలపై దాడి చేయడం వారి రౌడీ రాజకీయానికి నిదర్శనమని దుయ్యబట్టారు. బీజేపీ పాలన బ్రిటిష్ పాలనను తలపిస్తోందని విమర్శించారు.
విభజన హామీలను విస్మరించిన కేంద్రం..
2014లో రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని గండ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టం ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, ములుగు జిల్లాకు ట్రైబల్ యూనివర్సిటీ, మహబూబాబాద్‌కు ఉక్కు, కాజీపేటకు కోచ్ ప్యాక్టరీలు మంజూరు చేయాల్సి ఉండగా వాటి గురించి పట్టించుకోకుండా యాత్రలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 75 సంవత్సరాల ప్రజాస్వామ్య దేశంలో ప్రధాన మంత్రులు ప్రభుత్వరంగ సంస్థలను నెలకొల్పితే, మోదీ ప్రభుత్వం వాటిని అమ్ముతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మీడియా దృష్టిని ఆకర్శించడానికే తిట్ల పురాణం
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మీడియాను ఆకర్శించడానికే తిట్ల పురాణం మొదలు పెట్టాడని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ ప్రభుత్వం మరో రెండున్నర సంవత్సరాలు అధికారంలో ఉంటుందని, అనవసర ప్రసంగాలు ఆపాలని హెచ్చరించారు. అవివేకంతో దుష్ప్రచారం చేస్తే ప్రజలు వాటిని తిప్పి కొడతారని అన్నారు. ‘దళితబంధు’ను రాజకీయం చేయడం వారి అవివేకానికి నిదర్శనం అన్నారు. అదేవిధంగా జిల్లాలో వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్య తక్కువగా ఉన్నదని, ప్రతి ఒక్కరూ వేసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులను బడికి పంపించాలని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తల్లిదండ్రులకు సూచించారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
జిల్లాలోని భూపాలపల్లి, రేగొండ, గణఫురం మండలాలకు చెందిన 30 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.11.47 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, టీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు సాంబమూర్తి, కౌన్సిలర్లు అనిల్, రవీందర్, నాయకులు సిద్ధు, విద్యాసాగర్‌రెడ్డి, రమేశ్, రాజలింగమూర్తి, రవీందర్‌రెడ్డి, లక్ష్మీ నర్సింహారావు, ఎంపీపీలు, పార్టీ మండల అధ్యక్షులు, పీఏసీఎస్ చైర్మన్లు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.