అమెరికాలో రోడ్డు ప్రమాదం
తీవ్రంగా గాయపడిన అక్షిత మృతి
నాలుగు రోజుల క్రితమే అర్జిత్రెడ్డి ..
ఎన్ఆర్ఐ దంపతులకు గర్భశోకం
బండ్లగూడెం, జనగామలో విషాదం
లింగాలఘనపురం, డిసెంబర్ 26 : అమెరికాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రం గా గాయపడిన అక్కాతమ్ముడు చికిత్స పొం దుతూ మృతి చెందిన ఘటన బండ్లగూడెం, జనగామలో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని బండ్లగూడెం గ్రామానికి చెందిన సామాన్య రైతు కుటుంబానికి చెందిన చెట్టుపెల్లి రాధమ్మ-రాజిరెడ్డికి ప్రధమ పుత్రుడు చెట్టిపెల్లి రామచంద్రారెడ్డి. రామచంద్రారెడ్డి ఇంజినీరింగ్ చదివి అమెరికాకు 25 ఏళ్ల క్రితం వెళ్లి స్థిరపడ్డాడు. ఈ క్రమంలో జనగామకు చెందిన బేతి భారతమ్మ-నర్సిరెడ్డి కూతురు అలివేలు(రజని) ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తుండగా రామచంద్రారెడ్డి ఆమెను వివాహం చేసుకున్నాడు. అనంతరం అలివేలు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి భర్తతో అమెరికా వెళ్లిపోయిది. వీరికి అక్షిత(16), అర్జిత్రెడ్డి(14) జన్మించారు. ఈ నెల 19న లాస్ఏంజిల్స్లో ఓ శుభకార్యానికి రామచంద్రారెడ్డి, అలివేలు దంపతులు పిల్లలతో కలిసి శుభకార్యానికి వెళ్లి కారు లో వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అర్జిత్రెడ్డి అదే రోజు మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అక్షిత దవాఖానాలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. అక్కాతమ్ముడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఇరువురి దహన సంస్కారాలను సోమవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సంఘటన బండ్లగూడెం, జనగామలో విషాదాన్ని నింపింది.