భూపాలపల్లి టౌన్, డిసెంబర్ 26: భూపాలపల్లి పట్టణంలోని బాంబులగడ్డ వాసులు ఆందోళనకు దిగారు. 25 ఏళ్లుగా నివాసముంటున్న తమపై పట్టాదారు వేధింపులకు పాల్పడుతూ అనుచరులతో దాడులకు దిగుతున్నాడని పేర్కొంటూ ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఖాసీం అలీ, అతని అల్లుడు ఖలీమొద్దీన్ అనుచరుల బెదిరింపులు ఆపాలని డిమాండ్ చేశారు. సుమారు గంట పాటు వాహనాల రాకపోకలు స్థంభించిపోయాయి. ఎస్సై నరేశ్ పోలీసులతో అక్కడికి చేరుకుని వారితో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. భూపాలపల్లి పట్టణ శివారులోని బాంబులగడ్డలో ఖాసీం అలీ అనే భూస్వామికి ఉన్న పట్టా భూమిలో నిరుపేదలు సుమారు 25 ఏళ్ల క్రితం సీపీఐ ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. కాగా ప్రస్తుతం బాంబులగడ్డలో భారీగా ఇండ్లు వెలిశాయి. అధికారులు కరెంటు మీటర్లు, ఇంటి నంబర్లు ఇచ్చారు. ఇటీవలి కాలం నుంచి పట్టాదారు ఖాసీం అలీ, అతని కుటుంబ సభ్యులు, అనుచరులు ఇండ్లు నిర్మించుకున్న వారి వద్దకు వచ్చి గజాన రూ.4 నుంచి రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని కాలనీ వాసులు వాపోతున్నారు. ఆదివారం బాంబులగడ్డలో కాలనీ వాసులు సమావేశం కాగా ఖాసీం అలీ అల్లుడు ఖలీమొద్దీన్ తన అనుచరులతో వచ్చి శ్యాం అనే యువకున్ని దారుణంగా చితకబాదారని కాలనీ వాసులు పేర్కొన్నారు. దీంతో తామంతా రోడ్డెక్కాల్సి వచ్చిందని, తమకు న్యాయం జరిగేదాక కదలమని అన్నారు. ఎస్సై నరేశ్ వచ్చి వారితో మాట్లాడారు. దాడి చేసిన వారిపై ఫిర్యాదు ఇవ్వాలని కోరగా కాలనీ వాసులు ఆందోళన విరమించారు. మాకు పట్టాలు ఇచ్చేదాక పోరాటం చేస్తామన్నారు.