తెలంగాణ ఉర్దూ అకాడమీ సెక్రటరీ మహ్మద్ గౌస్
నగరంలో జాతీయస్థాయి ఉర్దూ కవి సమ్మేళనం
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 33మంది కవులు హాజరు
పోచమ్మమైదాన్, డిసెంబర్ 25 : రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ భాష అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నదని తెలంగాణ ఉర్దూ అకాడమీ సెక్రటరీ, డైరెక్టర్ డాక్టర్ మహ్మద్ గౌస్ అన్నారు. వరంగల్ ఎల్బీనగర్లోని అబ్నూస్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు జాతీయ స్థాయి ఉర్దూ కవి సమ్మేళనం(ముషాయిరా) నిర్వహించారు. సమ్మేళనానికి దేశంలోని పలు రాష్ర్టాల కవులు హాజరయ్యారు. మేధావుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ అనీస్ సిద్దిఖీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో ఇలాంటి సమ్మేళనాలు నిర్వహించడం వల్ల ఉర్దూ భాషకు మరింత పటిష్టత పెరుగుతుందన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఉర్దూ కవులకు ప్రోత్సాహం అందిస్తున్నదని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 35 మంది కవులకు ఆర్థికసాయం చేసిందన్నారు. కవులు రాసిన కవితలు, పుస్తకాలను ముద్రించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఉర్దూ భాష నేర్చుకోవాలని తపన ఉన్నవారి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్సైట్ ఓపెన్ చేసిందన్నారు. తెలుగు మీడియం అభ్యర్థులు ఉర్దూ నేర్చుకోవడానికి ఎక్కువగా ముందుకు వస్తున్నారని తెలిపారు.
కవులకు సత్కారం…
కవి సమ్మేళనానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 33 మంది కవులు హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అమెరికా నుంచి కవులు విచ్చేసి తమ కవితలను వినిపించారు. జహీర్ కా న్పూరీ (ఉత్తరప్రదేశ్), కుర్షీద్ ఫారూఖీ (మధ్యప్రదేశ్), సయీద్ నవాజ్ (అమెరికా), హాస్య కవి టిపికక్ జగిత్యాలీ (తెలంగాణ), హైదరాబాద్‌కు చెందిన తస్నీం జౌహార్, అహ్మదుల్లా ఖురేషీ, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన తా జ్ ముజితర్, మిర్జా మసూద్, డాక్టర్ అజీజ్, ఎక్బాల్ దర్ద్, హుస్సేనీ బర్తర్, వహీద్ గుల్షన్, హమీద్ అక్సీ, ఖాదర్ అన్సారీ, ప్రొఫెసర్ అహ్మద్ హుస్సేన్ ఖ యాల్, అక్బర్ జియా, హమీద్, మా హేర్ అబీదీలు తమ కవితలను వినిపించారు. జగిత్యాలకు చెందిన హాస్య కవి టిపికక్ తన హాస్యోక్తులతో అందరిని నవ్వుల్లో ముంచారు. అనంతరం కవులను సత్కరించి మెమెంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. వహీ ద్ గుల్షన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆర్ అండ్ బీ టెక్నికల్ ఆఫీసర్ సయ్యద్ మిస్బావుద్దీన్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ అసీం ఖురేషీ, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీద్ మసూద్, కార్పొరేటర్లు అబూబక్కర్, ఎండీ పుర్కాన్, సురేశ్‌కుమార్ జోషి, బీడీ లీవ్స్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సదా విజయ్‌కుమార్ పాల్గొన్నారు.