దేశంలో ఆకలిచావులు ఆందోళనకరం
ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు, రైతు నేత పోలాడి రామారావు
హనుమకొండ, డిసెంబర్ 25 : రాజకీయాలు మాని రైతులకు సేవ చేయాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, రైతు నేత పోలాడి రామారావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండలో శనివారం క్రిస్మస్ వేడుకల అనంతరం రాష్ట్ర నాయకులు, రైతు ప్రజా సంఘాల ప్రతినిధుల సమావేశంలో పోలాడి రామారావు మాట్లాడారు. దేశంలో తిండిలేక ఆకలితో రోజుకు ఏడు వేల మంది, సంవత్సరానికి 25 లక్షల మంది చనిపోతున్నారని స్వయంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెప్పడం ఆందోళన కలింగించే పరిణామని అన్నారు. దేశంలో ఇంత మంది ఆకలి చావులకు బలైపోతుంటే దేశ వ్యాప్తంగా గోదాముల్లో ఆహార ధాన్యాలు, తెలంగాణలో ఆధికంగా వచ్చిన ధాన్యం ఎవరి కోసం అన్న సందేహం కలుగకమానదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే కేంద్రం ఆకలితో అలమటిస్తున్న వారిని పట్టించుకోవడం లేదని అర్థమవుతుందని చెప్పారు. ఎఫ్సీఐ గిడ్డంగులు ఆహార ధాన్యాలతో నిండి ఉన్నాయని, ఒప్పందం మేరకే పంట ఉత్పత్తులను కొంటామని కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఓట్ల రాజకీయాలతో అన్నదాతలను విస్మరిస్తుందని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపు జయపాల్రెడ్డి, రైతు సంఘాల నాయకులు గుండవరపు రామకృష్ణ ప్రసాద్, బోయినపల్లి పాపారావు, దుబ్బా శ్రీనివాస్, చందుపట్ల నర్సింహారెడ్డి, సత్యమోహనశర్మ పాల్గొన్నారు.