తాడ్వాయిలో 50 ఎకరాల్లో భారీ బస్టాండ్
వరంగల్ రీజియన్ నుంచి 2,250 బస్సులు
ఈ సారి 21 లక్షల మంది ప్రయాణించనున్నట్లు అంచనా
జాతర విధుల్లో 12,250 మంది ఉద్యోగులు
కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఏర్పాట్లు
పనులను పరిశీలించిన ఆర్ఎం
హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 24; ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం మహాజాతరకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు సమ్మక్క-సారలమ్మ జాతర జరుగనుంది. ఈ క్రమంలో వన దేవతల దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలిరానుండడంతో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భా గంగా ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా 3,845, వరంగల్ రీజియన్ పరిధి నుంచి 2,250 బస్సులను మేడారానికి నడుపాలని నిర్ణయించింది. దీంతోపాటు తాడ్వాయిలో 50 ఎకరాల్లో భారీ బస్టాండ్‌ను నిర్మిస్తున్నది. ఈ సారి జాతరకు 21 లక్షల మంది ప్రయాణించనున్నట్లు అంచనా వేసి, 12,250 మంది ఉద్యోగులను విధుల్లో నియమించనుంది. కరోనా నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నది.
మేడారం మహాజాతరకు వరంగల్ ఆర్టీసీ రీజియన్ నుంచి 2,250 బస్సులను నడిపేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ సారి హైదరాబాద్ నుంచి ఏసీ బస్సులు తిప్పనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులతోపాటు వరంగల్ రీజియన్ నుంచి అత్యధికంగా బస్సులు నడుపనున్నారు. జాతరకు ఆర్టీసీ నుంచి మొత్తం 12,250 మంది ఉద్యోగులు విధుల్లో ఉండనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ ఉన్నతాధికారులు అన్ని వసతులు కల్పిస్తున్నారు.
భారీ బస్టాండ్ ఏర్పాటు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహా జాతరకు 3,845 బస్సులు నడుపనుండడంతో తాడ్వాయిలో భారీ బస్టాండ్‌కు ఆర్టీసీ అధికారులు శ్రీకారం చుట్టారు. 50 ఎకరాల్లో దీన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. స్థలాన్ని చదును చేసి టికెట్లకు మొత్తం 32 క్యూలైన్ల ఏర్పాటుకు పనులు ప్రారంభించారు. ఇప్పటికే ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం డీ విజయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. మేడారం బస్‌స్టేషన్ వద్ద కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయనున్నారు.
కరోనా జాగ్రత్తలు..
మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. కరోనా వైరస్ వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో శానిటైజేషన్ వంటి ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. బస్సుల్లో ప్రయాణించే వారికి మాస్క్ తప్పనిసరి చేయనున్నారు. మాస్క్ ఉంటేనే బస్సులోకి ఎంట్రీ చేయనున్నారు. కండక్టర్‌తోపాటు డ్రైవర్ కూడా తప్పనిసరిగా ఫేస్‌షీల్డ్ ధరించనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకోనున్నారు.