మూడేళ్లలో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు
రూ.1.60కోట్లతో డిస్కవరీ హాల్, రీసెర్చ్ సెంటర్, ఐడియా ల్యాబ్, డిజైన్ స్టూడియోల నిర్మాణం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం
కొత్త తరానికి ప్రోత్సాహకం
నూతన ఆవిష్కరణలకు మరింత ఊతం
వరంగల్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొత్త ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా వరంగల్ రీజినల్ సైన్స్ సెంటర్‌కు మరో కొత్త ప్రాజెక్టు మంజూరైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు ఇక్కడ ‘ప్రమోషన్ ఆఫ్ కల్చర్ ఆఫ్ సైన్స్’ పథకంలో భాగంగా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు కానుంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్(ఎన్సీఎస్ఎమ్) ఈ కొత్త ప్రాజెక్టును మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సమితి (టీఎస్కాస్ట్) ఆధ్వర్యంలో ఇది నిర్మితం కానుంది. సైన్స్ సెంటర్లో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుపై ఎన్సీఎస్ఎమ్ డైరెక్టర్ ఎస్.కుమార్, టీఎస్ కాస్ట్ మెంబర్ సెక్రటరీ ఎం నగేశ్ సమక్షంలో గురువారం కోల్‌కతాలోని ఎన్సీఎస్ఎం కేంద్ర కార్యాలయంలో ఒప్పందం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం ఖర్చు చేసేలా ఈ ప్రాజెక్టు ఉంటుంది. రూ.1.60 కోట్లతో మూడేండ్లలో దీన్ని ఏర్పాటు చేస్తారు. ఇన్నోవేషన్ హబ్ కోసం సైన్స్ సెంటర్లో శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపడుతారు. డిస్కవరీ హాల్, ఇన్నోవేషన్ రీసెర్చ్ సెంటర్, ఐడియా ల్యాబ్, డిజైన్ స్టూడియోలు నిర్మిస్తారు. కొత్త తరంలోని సృజనాత్మక, సైన్స్ ఆవిష్కరణలు, సంపద్రాయ సైన్స్‌లోని ఆలోచనలకు కార్యరూపం ఇచ్చేలా ఇన్నోవేషన్ హబ్ ఉండనుంది.
స్వరాష్ట్రంలోనే ప్రోత్సాహం
స్కూలు పిల్లలకు సైన్స్ ఆవిష్కరణలపై అవగాహన పెంచ డం, వారి ఆలోచనలకు కార్యరూపం ఇవ్వడం లక్ష్యంగా రీజినల్ సైన్స్ సెంటర్లను ఏర్పాటు చేయాలని 1986లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియలో భాగంగా వరంగల్, విజయవాడ, తిరుపతికి సైన్స్ సెంటర్లు మంజూరయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వరంగల్ సైన్స్ సెంటర్ నిర్మాణాన్ని పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత దీని నిర్మాణం పూర్తయ్యింది. పాఠ్యపుస్తకాల్లోని క్లిష్టమైన అంశాలను విద్యార్థులకు సులువుగా తెలియజేసే లక్ష్యంతో సైన్స్ సెంటర్ నిర్మించారు. రూ.5.87 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. శాస్త్ర, సాంకేతిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశంగా సైన్స్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. గణితం, భౌతిక, రసాయన, జీవశాస్ర్తాలకు సంబంధించిన మౌలిక అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించే ఎన్నో ఎగ్జిబిట్లు ఇందులో ఉన్నాయి. మూడు అంతస్తుల భవనం గల సైన్స్ సెంటర్ వద్ద పారింగ్ మొదలు, ప్రతీ అంతస్తులో వివిధ శాస్త్ర సాంకేతిక రంగాల ఎగ్జిబిట్లు ఉన్నాయి. ఏడు విశాలమైన హాళ్లు ఉన్న ప్రధాన భవనంలో మొదటి రెండు హాళ్లలో ఫిజికల్ సైన్స్ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశారు. మిగితా వాటిలో స్పేస్ సైన్స్, సోలార్ పవర్, 5డీ థియేటర్, పర్యావరణ కాలుష్యం, మానవ శరీర నిర్మాణ శాస్ర్తానికి సంబంధించిన నమూనాలున్నాయి. ఎడ్యుకేషన్ త్రూ సాటిలైట్ హాల్ సైతం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక సాంకేతిక సంస్థల్లో జరిగే వైజ్ఞానిక సదస్సులను ఈ హాల్లో ప్రత్యక్షంగా చూసే వీలుంటుంది. చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.