గద్దెల వద్దే ఆటోల్లో లోడింగ్
క్వింటాళ్ల కొద్దీ గ్రామాల్లోకి తరలింపు
రీసైకిలింగ్‌కు పంపకుండానే పక్కదారి
చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న ఎక్సైజ్ అధికారులు
భక్తులకు దక్కని ప్రసాదం
నిరాశతో వెనుదిరుగుతున్న వైనం
తాడ్వాయి, డిసెంబర్ 24 : అమ్మవార్ల గద్దెలపై భక్తులు సమర్పించిన బెల్లం నేరుగా గుడుంబా తయారీకి తరలుతోంది. ప్రతి రోజూ క్వింటాళ్ల కొద్దీ బెల్లం గద్దెల వద్ద పోగవుతుంది. దానిని జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన గుడుంబా వ్యాపారులు ఆటోలను గద్దెల వద్దకు తీసుకువచ్చి లోడ్ చేసుకుని తీసుకెళ్తున్నారు. పూజారులు పోగు చేసుకున్న బెల్లాన్ని అంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు రీసైకిలింగ్ కోసం తరలించాల్సి ఉండగా, ఎక్సైజ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. క్వింటాళ్ల కొద్ది రాత్రి పూట తరలుతున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో గ్రామాల్లో గుడుంబా గుప్పుమంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేవలం ఒక్క మేడారంలోనే బెల్లం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతులివ్వడంతో మరే ప్రాంతాల్లో బెల్లం దొరకడంలేదు. గుడుంబా తయారీదారులు కన్ను మేడారం వైపు మళ్లింది. తక్కువ ధరతో బెల్లం లభిస్తుండటంతో మేడారానికి వచ్చి బెల్లం కొనుగోలు చేస్తున్నారు. దీనిని కట్టడి చేయాల్సిన ఎక్సైజ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పవిత్రమైన తల్లుల ప్రసాదం గుడుంబాకు వినియోగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కిలోల కొద్దీ బెల్ల సమర్పించినా దక్కని ప్రసాదం
వనదేవతలు సమ్మక్క-సారలమ్మల దర్శణానికి వచ్చిన ప్రతి భక్తుడు కొంచమైనా తల్లుల ప్రసాదాన్ని తీసుకువెళ్లాలని కోరుకుంటాడు. కిలోల కొద్దీ అమ్మవార్లకు సమర్పించినా తిరిగి పిడికెడు బెల్లం భక్తులకు దొరకడం కష్టంగా మారింది. దీంతో వారు నిరాశతో వెనుదిరుగుతున్నారు. గద్దెలపై వేసి బెల్లాన్ని వెనువెంటనే పూజారులు సంచుల్లో నింపి పక్కకు పెట్టుకుంటున్నారు. నోరు విడిచి అడిగినా పిడికెడు బెల్లం కూడా ఇవ్వడంలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు తల్లుల ప్రసాదం దొరకడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాల్సిన దేవాదాయశాఖ అధికారులు కార్యాలయాలకే పరిమితమవడం శోచనీయం.
రీసైక్లింగ్‌కు అనుమతి అడగలేదు
గద్దెలపై బెల్లం పోగుచేసుకునే వారు రిసైక్లింగ్ కోసం అనుమతి తీసుకోలేదు. 2018 జాతరకు ముందు గద్దెల వద్ద పోగైన బెల్లాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లికి రీసైక్లింగ్‌కు పంపించే వాళ్లం. 2018 నుంచి ఇప్పటి వరకు బెల్లం పోగు చేసుకునే వారు కానీ దేవాదాయశాఖ అధికారుల గానీ అనుమతి కోరలేదు. తరుచుగా మేడారం పరిసర ప్రాంతాల్లో తనఖీలు నిర్వహిస్తున్నాం. బెల్లం ఎక్కడా దొరకలేదు. పోగు చేసిన బెల్లాన్ని ఏం చేస్తున్నారో తెలియదు. గద్దెలపై బెల్లాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తున్నారని సమాచారం ఉంది. గుడుంబాకు తరలిస్తే చర్యలు తీసుకుంటాం.