ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి క్రైస్తవులకు కానుకల పంపిణీ
పరకాల, డిసెంబర్ 22 : అన్ని మతాల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. క్రిస్మస్ పండుగను పురష్కరించుకుని ప్రభుత్వం అందజేసిన కానుకలను ఆయన బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదల సంతోషమే ముఖ్యమని సీఎం కేసీఆర్ నిధులు పథకాల అమలుకు నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. దళితుల ఆర్థికాభివృద్ధికి దళితబంధు ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అమలు చేసేలా సీఎం ప్రణాళిక రూపొందించారని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల విశ్వాసం పొందలేరన్నారు. అనంతరం సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో దామెర, ఆత్మకూరు మండలాలకు చెందిన 75 మంది వితంతువులకు రూ.25 వేల చొప్పున వడ్డీలేని రుణాలు అందజేశారు. కార్యక్రమంలో పరకాల, నడికూడ, ఆత్మకూర్, దామెర మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, యూత్ బాధ్యులు, చర్చిల పాస్టర్లు పాల్గొన్నారు.
మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి
మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుతో కలిసి పట్టణంలో రూ.4.5 కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్‌వెజ్ మార్కెట్, రూ.కోటితో శ్మశాన వాటిక పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో అధునాతన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందన్నారు. ప్రజలకు దగ్గరగా మార్కెట్ ఉండాలనే ఉద్దేశంతో పట్టణం మధ్యలో నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత రామకృష్ణ, వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ తిరునహరి శేషాంజన్ స్వామి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బండి సారంగపాణి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ బొచ్చు వినయ్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
టెక్స్టైల్ పార్క్‌తో ఉపాధి
దామెర, డిసెంబర్ 22 : మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో స్వర్ణ తెలంగాణ మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీనిధి రుణాలను 550 మంది మహిళలకు రూ.3.60 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారని చెప్పారు. మండల సమాఖ్య భవనానికి నిధులు కేటాయించడంతో పాటు పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. మెగా టెక్స్టైల్ పార్క్‌తో మహిళలకు ఉపాధి లభిస్తుందన్నారు. ఎంపీపీ కాగితాల శంకర్, జడ్పీటీసీ గరిగె కల్పనాకృష్ణమూర్తి, వైస్ ఎంపీపీ జాకీర్‌అలీ, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు పోలం కృపాకర్ రెడ్డి, సర్పంచ్ శ్రీరాంరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ గజ్జి విష్ణు, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గండు రామకృష్ణ, ముదిగొండ కృష్ణమూర్తి, బత్తిని చిన్నరాజు, ఎంపీడీవో వెంకటేశ్వర్రావు, ఎంపీవో యాదగిరి, ఏపీవో శారద, ఏపీఎం జాన్సీ, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.