మేడిపల్లి-రాంపూర్‌లో సేవా కేంద్రం, మెగా ఫంక్షన్‌హాల్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్
యశోద హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేవేందర్‌రావుతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
రూ.1.50కోట్లతో ఏర్పాటు
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో కుట్టు మిషన్లు, కంప్యూటర్లు
మహిళలు, యువతకు ఉచిత శిక్షణ
శిక్షకుల నియామకం
ఫంక్షన్‌హాల్ సైతం స్థానికులకు ఉచితం
వరంగల్, డిసెంబర్ 22(నమస్తేతెలంగాణ) : తెలుగు రాష్ర్టాల్లో ప్రముఖ వైద్య సేవల కేంద్రంగా నిలిచిన ‘యశోద హాస్పిటల్స్ గ్రూప్’ వ్యవస్థాపకులు తమ సొంతూరిపై మమకారాన్ని చాటారు. మారుమూలన ఉన్న తమ స్వగ్రామం మేడిపల్లి- రాంపూర్ గ్రామాల ప్రజలకు చేయూతనందిస్తున్నారు. గతంలో విలువైన భూమిని విరాళంగా ఇవ్వగా ఇప్పుడు రూ.1.50 కోట్లతో యశోద సేవా కేంద్రం, మెగా ఫంక్షన్ హాల్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కాంప్లెక్స్ నిర్మించారు. వీటిని యశోద హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోరుకంటి దేవేందర్‌రావుతో కలిసి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మేడిపల్లి- రాంపూర్ గ్రామాలతో పాటు చుట్టు పక్కన గ్రామాల ప్రజలు తరలివచ్చారు. మెగా ఫంక్షన్‌హాల్‌ను మేడిపల్లి- రాంపూర్ గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెండ్లి, ఇతర ఫంక్షన్లకు ఉచితంగా వాడుకోవచ్చని గోరుకంటి దేవేందర్‌రావు ప్రకటించగా స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
కుట్టుమిషన్లు.. కంప్యూటర్ల ఏర్పాటు
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వస్ర్తాలు కుట్టడం, కంప్యూటర్లో స్థానికులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ‘యశోద చారిటబుల్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు, కంప్యూటర్లు ఏర్పాటు చేసి శిక్షకులను కూడా నియమించారు. పరిసర గ్రామాల మహిళలకు కుట్టులో, యువతకు కంప్యూటర్లో శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అవసరమైతే హైదరాబాద్‌లోనూ శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ చింతపట్ల సురేష్, ఎంపీపీ ఊడుగుల సునీత, పీఏసీఎస్ చైర్మన్ సీహెచ్ మురళీధర్‌రావు, వైస్ చైర్మన్ మోహన్‌రావు, టీఆర్ఎస్ మండల కమిటీ అధ్యక్షుడు సారంగపాణి, పార్టీ నేతలు రాజేశ్వర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, విడియాల ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.
ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం..
ఉన్న ఊరు.. కన్న తల్లి రుణం ఏమిచ్చినా తీర్చుకోలేం. నేటి యువత కంప్యూటర్ కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నేర్చుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ కంపెనీల్లోనూ జాబ్ సంపాదించుకొని సంఘంలో గౌరవంగా బతుకొచ్చు. పల్లెటూరి కష్టాలను చిన్ననాటి నుంచి గుర్తెరిగిన మేము పుట్టిన గడ్డపై మమకారంతో ఇక్కడ సేవా కేంద్రాన్ని ప్రారంభించాం. నిరుపేదలకు ఉచిత శిక్షణ ఇప్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపడమే యశోద చారిటబుల్ ఫౌండేషన్ ముఖ్యోద్దేశం.