మాజీ సర్పంచ్ కొర్స రమేశ్ దారుణ హత్య
ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పరిధిలో ఘటన
లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ
ఏజెన్సీలో అలజడి..అప్రమత్తమైన పోలీసులు
అవసరం తీరాక ఇన్ఫార్మర్ నెపంతో హత్యలు చేస్తున్నారు : జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్
ములుగు, డిసెంబర్ 22 (నమస్తేతెలంగాణ)/ వెంకటాపురం(నూగూరు): మండలంలోని సూరవీడు మాజీ సర్పంచ్‌ను మావోయిస్టులు హత్య చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పరిధిలో బుధవారం జరిగింది. ఈ మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత లేఖను విడుదల చేశారు. సూరవీడు గ్రామానికి చెందిన కొర్స రమేశ్(మాజీ సర్పంచ్) 2019 నుంచి పోలీస్ ఇన్ఫార్మర్గా మారి వెంకటాపురం(నూగూరు) ఎస్సై భూక్యా తిరుపతిని పలుమార్లు కలిశాడని పేర్కొన్నారు. డబ్బు ఆశతో పోలీసులు, మావోయిస్టులకు మధ్య డబుల్ ఏజెంట్‌గా ఉంటూ ఎస్సై నుంచి రూ.35వేల నగదు తీసుకొని ఆయన కోసం పనిచేస్తున్నాడన్నారు. మావోయిస్టు వద్దకు వెళ్లినప్పుడు పోలీసులకు చెప్పాలని, సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా మావోయిస్టులను ఎన్కౌంటర్ చేస్తామని, వారిపై ఉన్న రివార్డులను ఇస్తామని రమేశ్‌ను ప్రలోభ పెట్టారన్నారు. ఎన్కౌంటర్ జరిగే సమయంలో అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో పోలీసులు ట్రైనింగ్ ఇచ్చారన్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు పాలపొడి తేవాలని రమేశ్‌కు చెప్పగా ఈ విషయాన్ని సదరు ఎస్సైకి తెలిపాడన్నారు. ఎస్సై పాలపొడిలో విషం కలిపి ఇవ్వగా అవి తాగిన మావోయిస్టు మ్యాదరి భిక్షపతి(విజేందర్) అమరుడయ్యాడని లేఖలో తెలిపారు. అలాగే రూ.2లక్షలు పోలీసుల వద్ద తీసుకొని ఒక ఎన్‌కౌంటర్‌కు కారకుడయ్యాడన్నారు. పార్టీకి ద్రోహం చేసిన రమేశ్‌ను చంపామని శాంత పేర్కొన్నారు.
ఇన్ఫార్మర్ నెపంతో హత్యలు :జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్
మాజీ సర్పంచ్ కొర్స రమేశ్ హత్య అనంతరం ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్ బుధవారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టులు అమాయక గిరిజనులను కొరియర్లుగా వాడుకొని అవసరం తీరాక పోలీస్ ఇన్ఫార్మర్ ముద్రవేసి అతి క్రూరంగా చంపివేస్తున్నారన్నారు. ఈ నెల 20న ఏటూరునాగారంలో నివసిస్తున్న కొర్స రమేశ్‌తో పాటు తిప్పాపురం గ్రామానికి చెందిన కుర్సం రమేశ్ మావోయిస్టు అగ్రనేత సుధాకర్ పిలుపు మేరకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని భీమారం గ్రామానికి వెళ్లారన్నారు. వీరిద్దరూ గతంలో మావోయిస్టు పార్టీకి కొరియర్లుగా పనిచేశారన్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చేరుకున్న అనంతరం వీరి కళ్లకు గంతలు కట్టి కొమటిపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారని తెలిపారు. కుర్సం రమేశ్‌ను చెర్ల మండలం పూసుకుప్ప గ్రామంలో వదిలేశారన్నారు. 22న ఉదయం వెంకటాపురం(నూగూరు) సరిహద్దు గ్రామమైన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కొత్తపల్లి వద్ద మృతదేహం ఉందని సమాచారం రాగా, పోలీసులు అక్కడికి వెళ్లి చూసి కొర్స రమేశ్గా గుర్తించినట్లు తెలిపారు. రమేశ్‌ను మావోయిస్టులు పోలీస్ ఇన్ఫార్మర్గా భావించి క్రూరంగా హింసించి తుపాకీతో తలలో కాల్చి చంపారన్నారు. ఇకపై గిరిజనులు మావోయిస్టులకు సహకరించొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు గిరిజనులకు అందకుండా ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవడమే మావోయిస్టు పార్టీ సిద్ధాంతమన్నారు.
మృతదేహంతో రోడ్డుపై బైఠాయింపు..
కొర్స రమేశ్‌ను మావోయిస్టులు హతమార్చడంతో అతడి భార్య రజిత, ఇద్దరు కుమారులు అనాథలుగా మిగిలారు. రమేశ్ హత్యతో సూరవీడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహానికి పోస్టుమార్టం వెంకటాపురంలోనే నిర్వహించాలని, మృతుడి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని సూరవీడు గ్రామ ప్రధాన రహదారిపై గ్రామస్తులు రాస్తారోకో చేశారు. కాగా, ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న ములుగు ఏజెన్సీ ప్రాంతంలో రమేశ్ హత్యతో అలజడి రేగింది. మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్న ప్రజాప్రతినిధులతో పాటు మాజీలను పోలీసులు అప్రమత్తం చేశారు. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు విస్తృత ప్రచారం చేస్తూ తనిఖీలు నిర్వహిస్తున్నారు.