చరిత్రాత్మకంగా కారుణ్య నియామకాలు
16,040 కారుణ్య, డిపెండెంట్, ఎక్స్టర్నల్ ఉద్యోగాలు
రూ.246 కోట్లతో భూపాలపల్లి, సత్తుపల్లిలో డబుల్ బెడ్రూం క్వార్టర్ల నిర్మాణం
కార్మికుల తల్లిదండ్రులకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం
రూ.10 లక్షలలోపు వడ్డీ లేని రుణం
నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం
భూపాలపల్లి, డిసెంబర్ 22;సమైక్య రాష్ట్రంలో అసౌకర్యాల నడుమ కాలం వెల్లదీసిన నల్ల సూర్యుల జీవితాల్లో.. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెలుగులు నింపారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణీయుల కష్టాలను దగ్గరుండి చూసి చలించిపోయిన కేసీఆర్.., ప్రస్తుతం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. ఆయన ఇచ్చిన పది హామీల్లో తొమ్మిదింటిని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. దీంతో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వం.. సీఎండీ శ్రీధర్ నేతృత్వంలో డైరెక్టర్ల పర్యవేక్షణలో సంస్థ ప్రగతి పథంలో పయనిస్తున్నది. లాభాల బాటలో పయనిస్తున్నది.
పక్క చిత్రంలో ఉన్న మహిళా ఉద్యోగి అంతడుపుల రమ్యకృష్ణ. తండ్రి పేరు పోశయ్య. ఎక్స్‌ప్లోసివ్స్ క్యారియర్‌గా పనిచేసేవారు. సర్వీస్ నాలుగేళ్లు ఉండగానే గుండెజబ్బు బారినపడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ చారిత్రాత్మకంగా కారుణ్య నియామకాలను అమలు చేశారు. ఈ క్రమంలో పోశయ్య అన్‌ఫిట్ అయ్యాడు. పోశయ్యకు ఇద్దరు కూతుళ్లే కాగా, పెద్ద కూతురుకు పెండ్లి అయ్యింది. చిన్నకూతురు రమ్యకృష్ణ డిగ్రీ ఫైనల్ఇయర్ చదువుతున్నది. దీంతో ఆమె 2020, జూలై 25న బదిలీ వర్కర్‌గా సంస్థలో చేరారు. కుటుంబానికి పెద్దదిక్కుగా నిలిచింది. ప్రస్తుతం కేటీకే-5వ గని సేఫ్టీ విభాగంలో పనిచేస్తున్న. సీఎం కేసీఆర్ చారిత్రాత్మకంగా అమలు చేస్తున్న కారుణ్య నియామకంతోనే ఉద్యోగం వచ్చిందని సంతోషం వ్యక్తం చేసింది.
కార్మికుల వారసులకు చారిత్రాత్మకంగా కారుణ్య నియామకాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 2018, మార్చి 9 నుంచి అమలు ప్రారంభమైంది. అప్పటి నుంచి నవంబర్ 30 వరకు 7,516 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. 2014 నుంచి ఇప్పటి వరకు 5037 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చాయి. కార్మిక వారసులు అదృష్టంగా భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ హామీతో ఉద్యోగుల తల్లిదండ్రులకు కార్పొరేట్ దవాఖానల్లో ఉచిత వైద్యం అందుతున్నది. ఇంతకుముందు సొంతంగా ఖర్చులను భరించేవారు. 2017, అక్టోబర్ 30న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో అనుమతి లభించింది. 9,656 మంది ఉద్యోగుల తల్లిదండ్రులకు ఉచిత వైద్యం అందించింది.
వివిధ కారణాలతో డిస్మిస్ అయిన 504 మందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. డిస్మిస్ అయిన ఏడాది నుంచి ముందు, వరుసగా ఐదేండ్లలో ఏదేని మూడేళ్లు ఏడాది కనీసం వంద మస్టర్ల చొప్పున కలిగి ఉండాలి. కానీ, టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా గెలుపొందిన తర్వాత ఆ నిబంధనను సడలించింది. ఐదేండ్లలో సంవత్సరానికి వంద మస్టర్లు ఉంటే తిరిగి ఉద్యోగం కల్పించే అవకాశాన్నికల్పించింది.సింగరేణి కార్మికులకు సంస్థ అధునాతనంగా డబుల్ బెడ్రూంతో కూడిన క్వార్టర్ల నిర్మాణం చేపట్టింది. భూపాలపల్లిలో రూ.166 కోట్లతో 994క్వార్టర్ల నిర్మాణం వేగవంతంగా కొనసాగిస్తున్నది. సత్తుపల్లిలో రూ.80కోట్లతో ఎండీ టైపు 280క్వార్టర్లు నిర్మించి కార్మికులకు అలాట్ చేశారు. అలాగే 80ఎంసీ టైపు క్వార్టర్ల నిర్మాణం పూర్తయ్యింది. రెండు నెలల్లో అలాట్ చేయనున్నది సంస్థ. యేటా సంస్థ ఆర్జించిన నికర లాభాల నుంచి వాటా చెల్లిస్తున్నది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో 23 శాతం చెల్లించారు. ఈ యేడాది (అక్టోబర్ 11న) 29 శాతం అందించారు. దసరా, రంజాన్, క్రిస్మస్ పండుగలకు అడ్వాన్స్ రూపంలో రూ.10 వేల నుంచి రూ.25 వేలకు పెంచారు. ప్రత్యే రాష్ట్రం ఏర్పడిన తర్వాత జాతీయ స్థాయిలో సింగరేణి సంస్థ బెస్ట్ మేనేజ్మెంట్.., పెర్ఫార్మెన్స్ ఎక్స్‌లెన్స్.., వ్యయ నిర్వహణలో అత్యుత్తమ అవార్డులను అందుకున్నది. సీఎండీ ఎన్ శ్రీధర్ రాష్ట్రం తరఫున అందుకున్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో అండర్‌గ్రౌండ్‌లో 190 మస్టర్లు, సర్ఫేస్‌లో 240 మస్టర్లు పూర్తిచేసిన 9,444 మంది బదిలీ వర్కర్లను జనరల్ మస్దూర్లుగా సంస్థ రెగ్యూలరైజ్ చేసింది. జనరల్ మస్దూర్ కావాలంటే గతంలో ఏండ్ల సమయం పట్టేది.స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత నోటిఫికేషన్ల ద్వారా 3,487 ఉద్యోగాలు భర్తీ చేశారు. ఈ ప్రక్రియ వేగవంతంగా సాగుతున్నది.
5,199 మందికి సొంతింటి నిర్మాణం కోసం రూ.10లక్షల వడ్డీ లేని రుణం అందించింది. వడ్డీని తిరిగి కార్మికులకు చెల్లిస్తున్నది. 2018, మార్చి 31 నుంచి అమలులోకి వచ్చిన ఈ పథకం ద్వారా రుణం పొందిన వారికి సంస్థ రూ.51,23,45,527ను చెల్లించింది.
ఐఐటీ, ఐఐఎం చదివే సింగరేణి ఉద్యోగుల పిల్లలకు మొత్తం ఫీజు సంస్థ చెల్లిస్తున్నది. 2017, అక్టోబర్ 14న అమలులోకి వచ్చింది. 29 మంది ఉన్నత చదువులకు రూ.1,67,76,840 సంస్థ చెల్లించింది.
కార్మికుల క్వార్టర్లలో ఏసీ సౌకర్యం కల్పించాలని సీఎం కేసీఆర్ సంస్థను ఆదేశించారు. ఇప్పటి వరకు సింగరేణి వ్యాప్తంగా 38,340 మందికి చెందిన క్వార్టర్లకు సౌకర్యం కల్పించారు. వారికి ఉచిత విద్యుత్ అందించేందుకు అవసరమైన విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు అమర్చారు. ఇందుకు సంస్థ యేటా రూ.60కోట్లు వెచ్చిస్తున్నది. ఇంతకుముందు ఉద్యోగుల బేసిక్‌పై 1 శాతం విద్యుత్ బిల్లు కింద వేతనంలో కోత విధించేది.
మహిళా ఉద్యోగినులకు ప్రసూతీ సెలవులను సీఎం కేసీఆర్ 26 వారాలకు పెంపుదల చేయించారు. అలాగే చైల్డ్‌కేర్ లీవన్ను రెండేళ్లు కల్పించారు. అంతకుముందు అసలే లేదు. ఇద్ది ఇద్దరు పిల్లలకు వర్తిస్తుంది. పిల్లల 18 ఏండ్లలోపు వరకు విడుతల వారీగా వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు 306 మంది పూర్తిగా, కొన్ని విడుతలుగా వినియోగించుకున్నారు.
మెడికల్ అన్‌ఫిట్ అయి, ఉద్యోగం వద్దనుకునే వారికి ఇంతకుముందు రూ.12.50 లక్షలు ఏకమొత్తంగా అందించేది. సీఎం కేసీఆర్ హామీ అమలులోకి వచ్చిన తర్వాత దానిని డబుల్ చేసి రూ.25 లక్షలు ఇస్తున్నది. ఏకమొత్తంలో వద్దనుకునే వారికి నెలకు రూ.25వేల చొప్పున చెల్లిస్తున్నది. 583 మంది ప్రయోజనం పొందారు.
అంబేద్కర్ జయంతి రోజున వేతనంతో కూడిన సెలవు, రంజాన్, క్రిస్మస్, సంక్రాంతికి (ఆప్షన్ హాలీడేస్) వేతనంతో కూడిన సెలవు అమలు చేస్తున్నది.
సింగరేణిలో ఆరు నూతన బొగ్గు గనులను సంస్థ ప్రారంభించింది.
2014కు ముందు యేటా రూ.32 కోట్లలోపే సంస్థ వైద్యం కోసం వెచ్చించేది. అదే ఈ ఏడాది పర్మినెంట్ ఉద్యోగులు, వారి తల్లిదండ్రులకు ఉచిత వైద్యం, దవాఖానల ఆధునీకరణ, ఆక్సిజన్ ప్లాంట్లు, కరోనా వైరస్ నివారణ, బాధితులకు వైద్యం తదితరాల కోసం రూ.280 కోట్లు వెచ్చించింది. సింగరేణి చరిత్రలో ఇదే మొదటిసారి.ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సింగరేణి కార్మికులకు 2011, సెప్టెబర్ 9 నుంచి అక్టోబర్ 17 వరకు స్పెషల్ క్యాజువల్ లీవ్‌గా మంజూరు చేశారు.