షూటింగ్ స్పాట్స్@బయ్యారం
ప్రకృతి సోయగాలకు ఫిదా అవుతున్న చిన్న నిర్మాతలు
ఆకట్టుకుంటున్న పచ్చని గుట్టలు, జలసవ్వడులు
పెద్దచెరువు, తులారం వద్ద జోరుగా సినిమా షూటింగ్‌లు
జోరుగా ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఆల్బమ్‌ల రూపకల్పన
ఏజెన్సీలో నెలల తరబడి షూటింగ్ సందడి
బయ్యారం, జనవరి 22 : కనుచూపు మేర పరుచుకున్న పచ్చని అందాలు, చుట్టూ ఎత్తైన గుట్టలు, కనువిందు చేసే జలపాతాల సోయగాలు, దారి వెంట పంట పొలాల సుందర దృశ్యాలకు బయ్యారం గుట్టలు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. మనసుకు ఆహ్లాదం పంచే ఈ ఏజెన్సీలోని ప్రాంతాలు ప్రకృతి ప్రేమికులను రారమ్మని పిలుస్తున్నాయి. ఇక్కడి అద్భుతమైన లొకేషన్లు సినిమాలు, ఆల్బమ్‌లు, పాటలు, ప్రీ వెడ్డింగ్ షూట్లకు వేదికలుగా మారుతున్నాయి. అన్ని రకాల చిత్రీకరణలకు అనువుగా ఉన్న షూటింగ్ స్పాట్స్‌కు ఫిదా అయిన చిన్న చిత్రాల నిర్మాతలు ఇప్పటికే అనేక సినిమాలు, ఆల్బమ్‌లు తీయగా సిల్వర్ స్క్రీన్‌పై ‘బయ్యారం అందాలు’ మెరుస్తున్నాయి.
ఎటుచూసినా పచ్చని గుట్టలు.. జలధారల సవ్వడులు.. పక్షుల కిలకిలరావాలు.. ప్రశాంత వా తావరణం.. మనసుకు ఆహ్లాదాన్ని పంచే సుందర దృశ్యాలు బయ్యారం మండలం సొంతం. పూర్తిగా ఏజెన్సీ గ్రామాలున్న ఈ మండలంలో గుట్టలను ఆనుకుని ఉన్న పల్లెలు.. రహదారుల వెంట పంటపొలాలు ముచ్చట గొలుపుతున్నాయి. బ య్యారం గుట్టల్లో ఉన్న ఏడుబావులు, పెద్దగుట్ట జలపాతాలు కనువిందు చేస్తాయి. ఇలాంటి పల్లె అందాలకు ఫిదా అయిన కొందరు వీటిని షూటింగ్ స్పాట్స్‌గా ఎంచుకుంటున్నారు. సినిమాల్లోని పలు సన్నివేశాలు, పాటలు, ప్రైవేట్ ఆల్బమ్‌లు, ప్రీ వెడ్డింగ్ షూట్స్ వంటి ఇక్కడ రూపొందిస్తున్నారు.
జోరుగా సినిమాల షూటింగ్
బయ్యారం ప్రాంతంలో సినిమా షూటింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడి పెద్దచెరువు అలుగు, రామునిగుండం, భీమునిగుండం ప్రాంతంలో ‘ఒక్కడితో మొదలైంది’ అనే సినిమాను చిత్రీకరించారు. ఒక పాటతో పాటు పలు సన్నివేశాలను హీరో మోహన్, హీరోయిన్ మైనా, కమెడియన్ ధనరాజ్‌పై వారం రోజులపాటు షూటింగ్ చేశారు. డైరెక్టర్ గుర్రాల ఉదయ్ గౌరారం, ఉప్పలపాడు, మహబూబాబాద్ సరిహద్దు కంబాలపల్లి పరిసర ప్రాంతాల్లో హీరోయిన్ గౌరీ, హీరో హరిట్ కథానాయకులుగా ‘కంబాలపల్లి కథలు’ పేరుతో మెయిల్ అనే సినిమా తీశారు. దీనిని 50రోజుల పాటు చిత్రీకరించారు. ఇటీవల రాజన్న సినిమా ఫేం చిన్నారి ఆని హీరోయిన్గా నిర్మిస్తున్న ఓ సినిమాను నాలుగు రోజుల పాటు తులారం ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల్లో రూపొందించారు. వీటితో పాటు చిన్నచిత్రాల నిర్మాతలు ఇక్కడ సినిమాలు రూపొందించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సినిమా షూటింగ్‌ల వేళ చుట్టపక్క గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంటున్నది. సినీతారలను ప్రజలు పెద్ద ఎత్తున తరలిస్తుంటారు. ఇలా నెలల తరబడి షూటింగ్ హంగామా కనిపిస్తోంది. అంతేకాకుండా సినిమా రిలీజ్ అయిన తర్వాత తెరపై తమ ఊరి అందాలను చూసి జనం మురిసిపోతున్నారు.
ప్రీ వెడ్డింగ్ షూట్స్..
బయ్యారం పరిసరాల్లో ప్రీ వెడ్డింగ్ షూట్లు జోరుగా సాగుతున్నాయి. పెళ్లికి ముందు కొత్త జంటలు ఇష్టపడి తీసుకొనే ఈ షూట్ ఇప్పుడు ట్రెండ్‌గా మారగా, చిత్రీకరణకు అనువైన దృశ్యాల కోసం ఫొటోగ్రాఫర్లు ఇక్కడికి వస్తున్నారు. సినిమా షూటింగ్‌కు తీసిపోని వాతావరణం, ప్రకృతి సోయగాలు వారికి అమితంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఇక్కడి లొకేషన్లలో షూట్ కోసం జంటలు ఇష్టపడుతున్నాయి.
పల్లె కథాచిత్రాలకు అనువైన ప్రాంతం
పల్లె ఇతివృత్తంలో సాగే సినిమాల చిత్రీకరణకు బయ్యారం ఏజెన్సీలోని పలు ప్రాంతాలు అనువుగా ఉన్నాయి. మహబూబాబాద్, బయ్యారం సరిహద్దు గౌరారం, ఉప్పలపాడు, వినోబానగర్ పరిసర ప్రాంతాల్లో కంబాలపల్లి కథలు (మెయిల్) చిత్రాన్ని సుమారు 50రోజుల పాటు చిత్రీకరించాం. హీరో, హీరోయిన్లపై ముఖ్యమైన సన్నివేశాలు ఇక్కడే రూపొందించాం.